ఇంటెలిజెన్స్ నివేదిక అంటూ జనసేనపై ఆరోపణలు.. వెనుక ఎవరో తెలుసు : నాదెండ్ల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 23, 2022, 6:39 PM IST
Highlights

ఏపీ మంత్రులపై జనసేన కేడర్ దాడి చేసే అవకాశాలున్నాయంటూ దుష్ప్రచారం జరుగుతోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు లభిస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. 

ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత మంగళగిరిలో పవన్ కల్యాణ్ ఆవేశపూరిత ప్రసంగం నేపథ్యంలో వైసీపీ, జనసేన వర్గాల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రులపై జనసేన కేడర్ దాడి చేసే అవకాశాలున్నాయంటూ దుష్ప్రచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో జనసేనపై మరో కుట్రకు తెరదీశారని... ఇలాంటి ప్రచారాలు ఎవరు, ఎందుకు చేస్తున్నారో తెలుసునని నాదెండ్ల పేర్కొన్నారు. జనసేనకు లభిస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ కుట్రలు చేస్తోందని.. దీనిపై డీజీపీ విచారణ చేయించాలని మనోహర్ డిమాండ్ చేశారు. అలాగే వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని జనసేన శ్రేణులకు నాదెండ్ల పిలుపునిచ్చారు. 

అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో మంత్రులు జోగి రమేశ్, రోజా , టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై దాడులకు సంబంధించి అరెస్ట్ అయిన 9 మంది జనసేన నేతలకు బెయిల్ లభించడం పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. విశాఖలో అధికారపక్షం బనాయించిన అక్రమ కేసుల కారణంగా జైలు పాలైన జనసేన నేతలు బెయిల్‌పై బయటకు రావడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. వీరు కారాగారంలో వున్న సమయంలో వీరి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనకు గురయ్యారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటం చేసిన జనసేన లీగల్ సెల్ సభ్యులకు, వారికి అండగా నిలిచిన లాయర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు 

Also Read:విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి... జైలు నుంచి విడుదలైన 9 మంది జనసేన నేతలు

విశాఖలో అక్రమాలకు పాల్పడుతోన్నవారు ఎవరో నగర ప్రజలకు, ఏపీ ప్రజలకు తెలుసునని పవన్ దుయ్యబట్టారు. వాస్తవాలు మరింతగా వెలుగులోకి వస్తాయనే జనసేన నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విమానాశ్రయంలో డ్రామాలు సృష్టించారని పవన్ ఆరోపించారు. ఈ ఘటనల సాకుతో జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలను ఇరికించారని.. నిబంధనలకు విరుద్ధంగా వీరిని అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కచ్చితంగా న్యాయ పోరాటం చేయాలని, కేసులు దాఖలు చేయాలని జనసేన లీగల్ సెల్ సభ్యులకు పవన్ కల్యాణ్ సూచించారు. 

click me!