నేను నాయకుడిని అవుతానని భయపడొద్దు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : ధర్మాన సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 23, 2022, 5:02 PM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకోవడం లేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడితే తెలుగుదేశం పార్టీకి అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు.

దశాబ్ధాల వెనుకబాటుతనం పోవాలంటే వికేంద్రీకరణే మార్గమన్నారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆదివారం మూడు రాజధానులపై శ్రీకాకుళంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే విభజన ఉద్యమం వచ్చేది కాదని ధర్మాన పేర్కొన్నారు. భారీ ఖర్చుతో ఏపీకి రాజధాని నిర్మాణం వద్దని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని... అయినా రూ.లక్షల కోట్ల ఖర్చుతో అమరావతి ప్రతిపాదన చేశారని ధర్మాన మండిపడ్డారు. 

ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చెప్పే వాళ్లెవరైనా ఆ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నట్లే లెక్క అని ఆయన పేర్కొన్నారు. ఇడుపులపాయలో రాజధాని పెట్టాలని జగన్ కోరుకోవడం లేదని.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడితే తెలుగుదేశం పార్టీకి అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. 23 కేంద్ర సంస్థల్లో ఒక్కటి కూడా ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయలేదని ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాన ప్రసాదరావు నాయకుడవుతాడన్న ఆలోచన చేయొద్దని... వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలని భావిస్తున్నట్లు ప్రసాదరావు తెలిపారు. 

ALso REad:మూడు రాజధానుల వ్యవహారం.. రాజీనామాకు అనుమతి కోరిన ధర్మాన, వారించిన సీఎం జగన్

ఇకపోతే... మూడు రాజధానుల అంశంపై అధికార వైసీపీ నుంచి కీలక సంకేతాలు వెలువడుతున్నాయి. శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో మంత్రి ధర్మాన ప్రసాదరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన రాజీనామా ప్రతిపాదనను జగన్‌తో ప్రస్తావించారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖ సాధనా ఉద్యమం కోసం రాజీనామా చేస్తానని ధర్మాన తెలిపారు. ఉద్యమం చురుగ్గా చైతన్యవంతంగా సాగేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. 

ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను నెరవేర్చడం కంటే మంత్రి పదవి గొప్పది కాదని ధర్మాన అన్నారు. తన రాజీనామాను అనుమతించాలని సీఎం జగన్‌ కోరారు. అయితే మంత్రి ధర్మానను ముఖ్యమంత్రి వారించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ధ్యేయమని ధర్మానకు మరోసారి స్పష్టం చేశారు జగన్. అభివృద్దిని అన్ని ప్రాంతాలకు పంచుతూ , వికేంద్రీకరణ , సమగ్ర అభివృద్ధే తమ విధానమని జగన్ చెప్పారు. మూడు ప్రాంతాలకు సమ న్యాయమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి తెలిపారు. 

click me!