మాజీ సైనికుడిపై కత్తులు, రాడ్లతో దాడి... మాజీ మంత్రి అవంతి అనుచరుల పనేనా?

By Arun Kumar PFirst Published Aug 24, 2023, 10:35 AM IST
Highlights

మాజీ సైనికుడిపై కొందరు దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాత్రి ఒంటరిగా వెళుతున్న అతడిపై కత్తులు, రాడ్లతో దాడిచేసి చంపడానికి ప్రయత్నించారు. ఈ దారుణం విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 

విశాఖపట్నం : మాజీ సైనికోద్యోగిపై కొందరు దుండగులు కత్తులు, ఇనుపరాడ్లతో దాడిచేసిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రాణభయంతో పరుగుతీసిన అతడిని వెంటపడుతూ చంపడానికి ప్రయత్నించారు. అయితే మాజీ సైనికుడి కేకలు విని గ్రామస్తులు గుమిగూడటంతో దుండగులు పరారయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ సైనికుడు తనను చంపడానికి చూసింది మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అనుచరులేనని ఆరోపిస్తున్నాడు. 

బాధిత మాజీ సైనికోద్యోగి, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం రేవిడి పంచాయితీ రౌతులపాలెంకు చెంది మోపాడ ఆదినారాయణ(40) మాజీ సైనికోద్యోగి. గతంలో భారత సైన్యంతో పనిచేసిన అతడు ప్రస్తుతం గ్రామంలోనే వుంటున్నాడు. అయితే ఇతడు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుండటం, ఇటీవల ప్రభుత్వ భూమి ఆక్రమణను అడ్డుకున్నాడు. దీంతో వారికి అడ్డు వస్తున్నానని అధికార వైసిపి నాయకులే తనను అంతమొందించడానికి ప్రయత్నించినట్లు ఆదినారాయణ ఆరోపిస్తున్నాడు.

మంగళవారం పనిపై బయటకు వెళ్లిన ఆదినారాయణ రాత్రి ఒంటరిగా గ్రామానికి వెళుతుండగా కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. గ్రామ శివారులో కాపుకాసిన దుండగులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. దుండగుల నుండి తప్పించుకున్న అతడు గ్రామంలోకి పరుగుతీసాడు. దుండగులు కూడా అతడిని వెంటపడ్డారు. గ్రామంలోకి చేరుకున్న ఆదినారాయణ ప్రాణభయంతో కేకలు వేయగా గ్రామస్తులు గుమిగూడారు. దీంతో దుండుగులు అక్కడినుండి పరారయ్యారు. 

Read More  ప్రియుడితో కలిసి భర్త హత్య.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం.. కానీ చివరికి..

గాయాలతో పడిపోయిన ఆదినారాయణను కుటుంబసభ్యులు తగరపువలసలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గానే వుందని... ప్రాణాపాయమేమీ లేదని డాక్టర్లు తెలిపారు. అతడి తలతో పాటు శరీరంలో పలుచోట్ల గాయాలయ్యాయని... వాటికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

అయితే తనపై హత్యాయత్నానికి పాల్పడింది మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అనుచరులు, స్థానిక వైసిపి నాయకులేనని ఆదినారాయణ ఆరోపిస్తున్నారు. రేవిడి పంచాయితీ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా తాను కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అలాగే చెరువును ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నానని తెలిపాడు. ఇలా వారి అక్రమాలను అడ్డుకుంటున్నాననే బీమిలి ఎమ్మెల్యే అనుచరులే తనను చంపించడానికి కిరాయి మూకలను పంపించారని అన్నారు. తన కదలికలపై రెక్కీ నిర్వహించి మంగళవారం రాత్రి దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆదినారాయణ ఆరోపించాడు. 

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదినారాయణ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అనుచరులపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడని... ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

click me!