మునుగోడు బైపోల్ 2022 : జనసేన పోటీ చేయదు.. నేనే వద్దన్నా.. పవన్ కల్యాణ్

By Bukka SumabalaFirst Published Aug 22, 2022, 9:23 AM IST
Highlights

మునుగోడులో జనసేన పోటీ చేయదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తాను నిర్మాణాత్మక రాజకీయాలే చేస్తాను తప్పా.. ద్వేషపూరిత రాజకీయాలు చేయనని చెప్పుకొచ్చారు. 

తిరుపతి : మునుగోడు ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అయితే, తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో ఈ మేరకు మాట్లాడారు.  మునుగోడులో పోటీ చేద్దామని పార్టీ నాయకులు తనను కోరినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. 100, వెయ్యి ఓట్లతో ప్రయోజనం లేదని, అందుకే పోటీ వద్దన్నానని తెలిపారు. ‘నేను నిర్మాణాత్మక రాజకీయాలే చేస్తాను తప్పా.. ద్వేషపూరిత రాజకీయాలు చేయను’ అని అన్నారు. ఏపీ సీఎం జగన్ పై పవన్ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. అవెంజర్స్  సినిమాలో విలన్ థానోస్ తో జగన్ను పోల్చారు. 

‘విశ్వానికి మంచి చేస్తున్నా అనే భ్రమలో తాను సగం మంది ప్రజల్ని చంపేస్తాడు. అదే తరహాలో ఆంధ్రలో జగన్ కూడా నవరత్నాల పేరిట జగన్ ని చంపేస్తున్నాడు’ అని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి కూడా మీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలా… మీ కోటలోకి వచ్చే వాహనాలు కోట బయట వదిలి నడుచుకుంటూ రావాలా... అని మండిపడ్డారు. ఈ పరిస్థితి మారాలి అని పవన్ అన్నారు.

ఆ కోవర్టుల వల్లే ప్రజారాజ్యంను నిలబెట్టుకోలేకపోయాం.. అలాంటప్పుడు ప్రత్యర్థులతో కూడా కలుస్తాం: పవన్ కల్యాణ్

బెదిరించినా.. భయపడలేదు..
తెలుగు సినీ పరిశ్రమ ఏ ఒక్క కులానిది కాదని, మెగా ఫ్యామిలీని అసలే కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. సినీ పరిశ్రమ అందరిదీ అని చెప్పారు. నిఖిల్ హీరోగా కార్తికేయ సినిమా తీస్తే సక్సెస్ కాలేదా అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ 2009లో ప్రజలకు మూడో ప్రత్యామ్నాయంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని  పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే, వైయస్ కుటుంబం కోవర్టుల వల్ల ఆ పార్టీని నిలబెట్టుకోలేక పోయారని పేర్కొన్నారు. ‘వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. అప్పట్లో సీఎం నుంచి ఆహ్వానాలు వచ్చాయి. నేను స్పందించలేదు. భయపడలేదు’  అని చెప్పారు.

రీ అంబర్స్ మెంట్ అడిగితే జైలుకా…
జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని పవన్కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఆ చట్టం కింద కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.  ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడిగినందుకు చిత్తూరు జిల్లా పూతలపట్టు లో 14 మందిపై కేసులు పెట్టి జైల్లో వేశారని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి  రాకూడదని,  ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

click me!