యాప్ ఆధారిత హాజరు : పది నిమిషాల సడలింపు, నెట్ వర్క్ పనిచేయకపోతే ఆన్లైన్ హాజరు..

By Bukka SumabalaFirst Published Aug 22, 2022, 6:37 AM IST
Highlights

ఏపీలో గతవారం ప్రవేశ పెట్టిన యాప్ ఆధారిత అటెండెన్స్ విధానంలో ప్రభుత్వం కొన్ని సడలింపులు తీసుకువచ్చింది. పది నిమిషాల పాటు గ్రేస్ టైంతో పాటు.. నెట్ వర్క్ పనిచేయని సమయంలో ఆన్లైన్ ద్వారా హాజరును తీసుకువచ్చింది.

అమరావతి : ఉపాధ్యాయుల ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇదివరకు ఉదయం 9 గంటలలోపే కచ్చితంగా నిర్దేశిత యాప్లో ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలని ఆదేశాలు ఉండగా, దానికి అదనంగా మరో పది నిమిషాల గ్రేస్ సమయాన్ని ఇస్తూ.. ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నెట్వర్కు సమస్యల కారణంగా యాప్ పనిచేయని సందర్భంలో ఆన్లైన్ ద్వారా హాజరు నమోదు చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు వెల్లడించింది. 

ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు మరచిపోతే ఇతర ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సెల్ఫోన్లలోనూ నమోదుకు అవకాశం ఇచ్చింది. డిప్యూటేషన్,  శిక్షణకి వెళ్ళినప్పుడు,  ఆన్ డ్యూటీ లో ఉన్నవారికి ప్రత్యేకంగా లీవ్ మాడ్యూల్ ను ఈనెల 25 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల సెలవుల వివరాల్ని కూడా యాప్లోని అప్లోడ్ చేయాలని వెల్లడించింది. పైలెట్ విధానంలో ఈ నెలాఖరు వరకు యాప్లో హాజరు నమోదు కొనసాగిస్తామని, ఇప్పటికీ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోని వారు తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

పౌరులూ యాప్ సిద్ధం చేస్తారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేస్తారు.. పవన్ కల్యాణ్..

ఇదిలా ఉండగా,  ఏపీ ప్రభుత్వం టీచర్ల హాజరు విషయంలో తీసుకువచ్చిన యాప్ ఆధారిత హాజరు మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.  ప్రతిపక్షాలు దీనిమీద మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగస్ట్ 18న ఒక ట్వీట్ చేశారు. ‘ఉపాధ్యాయులు జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. పాఠశాలకు రాగానే అందరూ అందులో హాజరు నమోదు చేయాలని ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తోంది. అదే తరహాలో పౌరులు కూడా ఒక యాప్ సిద్ధం చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేసేలా అది ఉంటుంది. బాధ్యత ఎప్పుడూ ఒకరికి ఉండకూడదు. అందరికీ అది ఉండాలి’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

ఈ మేరకు గత బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనికి ఒక కార్టూన్ కూడా జోడించారు. ఉపాధ్యాయులు సిగ్నల్ కోసం అటు, ఇటు తిరుగుతున్నట్లుగా ఆ కార్టూన్ లో ఉంటుంది. అందులో స్కూల్ అటెండర్ మాట్లాడుతూ..‘ పాపం రాగానే పిల్లలకు పాఠాలు చెప్పే వాళ్ళు.. అదేదో యాప్ అట.. దాని సిగ్నల్ కోసం చెట్టుకొకరు, పుట్టకొకరు తిరుగుతున్నారు సార్’  అని వేరే ఎవరికో చెబుతున్నట్లు ఉంది. 

ఇదిలా ఉండగా,  ఏపీలో గత మంగళవారం నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులకు యాప్ ఆధారిత హాజరు విధానం అమల్లోకి వచ్చింది. ఈ యాప్ ఆధారిత హాజరు విషయమై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటలలోపు ఉపాధ్యాయులు స్కూల్ కు హాజరు కావాలి. స్కూల్ కు హాజరైన వెంటనే ఫేస్ రికగ్నైజేషన్ తో పాటు ఫోటోను కూడా విద్యాశాఖ సూచించిన యాప్ లో అప్లోడ్ చేయాలని సూచించింది.

స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయులు వెంటనే ఈ యాప్ లో లాగిన్ కావాలని విద్యా శాఖ కోరింది. ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా కూడా సగం వేతనం కట్ చేస్తామని విద్యా శాఖ తేల్చి చెప్పింది. ఈ యాప్ ఆధారంగానే ఉపాధ్యాయుల హాజరును విద్యాశాఖ పరిగణించనుంది. 

click me!