కాపు ఉద్యమంపై పోలీస్ జులుం

First Published Jul 26, 2017, 7:43 PM IST
Highlights
  • ముద్రగడ గృహనిర్బందంపై కాపు ఐక్య గర్జన లాయర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు  
  • కాపు జాతి  స్వేచ్ఛను ప్రభుత్వం అణచివేస్తోందన్న ముద్రగడ

 
కాపు ఉద్యమనేత ముద్రగడ గృహనిర్బందం చేసిన పోలీసులపై  కాపు ఐక్య గర్జన లాయర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ముద్రగడను వెంటనే నిర్బందం నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చలో అమరావతి  పాదయాత్రకు మద్దతుగా  జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్న ర్యాలీలు,  నిరసనలను పోలీసులతో ప్రభుత్వం అణచివేయిస్తోందని వారు వాపోయారు. సాధారణ ప్రజలపై బైండోవర్‌ లు, కేసులు పెట్టడం దారుణమని,పోలీసుల దౌర్జన్యాన్ని ఆపేలా ఆదేశాలివ్వాలని  విజ్ఞప్తి చేశారు.  
 చలో అమరావతి పేరుతో ముద్రగడ తలపెట్టిన పాదయాత్రను పొద్దునే ఆపేసారు పోలీసులు. గాంధేయ మార్గంలో ఉద్యమాన్ని చేస్తానన్న ప్రభుత్వం పోలీసులను మొహరించడాన్ని ముద్రగడ తప్పుబట్టారు. మొదటి నుంచి  కాపు జాతి  స్వేచ్ఛను ప్రభుత్వం అణచివేస్తోందని ద్వజమెత్తారు. తాను ఉగ్రవాదిని కాదని, నాపై కేసులు పెట్టి గృహ నిర్బందం విదించడం ద్వారా మానవ హక్కులను హరిస్తున్నారని ఆరోపించారు.  పోలీసులను చేతులు జోడించి  వేడుకున్నప్పటికి పాదయాత్రకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
అతాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, పీసీసీ ప్రధాన కార్యదర్శి నరసింహారావును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. పలువురు కాపు నేతల వెనుక పోలీస్ షాడో పార్టీలు తిరుగుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని  కాపు నాయకులు ఆవేదన  చెందుతున్నారు.      
అయితే పొద్దన్నుంచి కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటివద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.   పాదయాత్ర  సిద్దమైన ముద్రగడ ఉదయం 10 గంటలకు   తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. 10.13 గంటలకు పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులతో గొడవపడినంత పనిచేసిన ముద్రగడ వారు బయటకు అనుమతించకపోయే సరికి 10.37 గంటలకు అసహనంతో ఇంట్లోకి వెనుదిరిగారు.  
 దీనిపై జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ... సీఆర్పీసీ 151 కింద చట్టప్రకారమే హౌస్ అరెస్టు చేశామన్నారు.  ఆయన ఇంటివద్ద 144 సెక్షన్ ఉండటం వల్ల మీడియాను  అనుమతించలేదని ఎస్పీ తెలిపారు. 
 

click me!