
ముద్రగడ విషయంలో ప్రభుత్వం చాలా అతి చేస్తోందేమోనని అనిపిస్తోంది. ముద్రగడను పాదయాత్ర చేయనీయకుండా నిలువరించేందుకు జిల్లా వ్యాప్తంగా ఏకంగా ఐదు వేల మంది పోలీసులను మోహరించాలా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. కాపులకు రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం తన సొంతూరు కిర్లంపూడి నుండి అంతర్వేది వరకూ బుధవారం నుండి ఐదు రోజుల పాటు సత్యాగ్రహ యాత్ర చేపట్టాలని అనుకున్నారు.
ముద్రగడ నిర్ణయం వెలువడగానే ప్రభుత్వ అప్రమత్తమైంది. వెంటనే పోలీసులను రంగంలోకి దింపేసింది. ఇంకేముంది, మొత్తం కిర్లంపూడి పోలీసులతో నిండిపోయింది. ముద్రగడను మంగళవారమే గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. 48 గంటలపాటు నివాసం నుండి బయటకు రానిచ్చేది లేదని ఎవరినీ ముద్రగడను కలవనిచ్చేది లేదని పోలీసులు ప్రకటించారు. ఇదంతా చూస్తున్న సామాన్యులకు ముద్రగడ అంటే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటని ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారిగా వేలమంది పోలీసులు రంగంలోకి దిగటంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులంతా ఇంకే పనీ లేనట్లుగా ముద్రగడ ఇంటి వద్దే కాపుకాసారు. ముద్రగడను ఎలాగూ గృహనిర్బంధంలో ఉంచిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు అక్కడేమి పని? ఇంటి చుట్టుపక్కలే కాకుండా మొత్తం కిర్లంపూడిలోనే పదుల సంఖ్యలో చెక్ పోస్టులు పెట్టి ఎవరినీ రోజువారీ పనులు కూడా చేసుకోనీకుండా అడ్డుకుంటున్నారు. దాంతో ప్రభుత్వంపైన సామాన్యులకు విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇంతకీ ముద్రగడ అడుగుతున్నదేమిటి? కాపులను బిసిల్లో చేర్చమని. ఎందుకడుగుతున్నారు? కాపులను బిసిల్లో చేరుస్తానని గడచిన ఎన్నికల్లో స్వయంగా చంద్రబాబునాయడే హామీని ఇచ్చారు కాబట్టి. అధికారంలోకి రావటమే లక్ష్యంగా చంద్రబాబు నాడు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అవ్వగానే పక్కన పడేసారు. ఏడాది గడచినా ఇచ్చిన హామీని పట్టించుకోకపోతే ముద్రగడ ఆందోళనకు దిగారు.
మొన్నటి తుని రైలు దహనం ఘటన తర్వాత ప్రభుత్వానికి ముద్రగడ కొరకరాని కొయ్యగా మారారు. ఇచ్చిన హామీని అమలు చేయటంలో చిత్తశుద్ది చూపకుండా చంద్రబాబు సాచివేత ధోరణితో వ్యవహరిస్తుండటంతోనే సమస్య బాగా ముదిరిపోతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అది సమస్యగా మారిన తర్వాత దాన్నుండి గట్టెక్కటానికి ఓ వైపు ముంజూనాధ కమీషన్ వేస్తూ, మరోవైపు ముద్రగడకు వ్యతిరేకంగా మరికొందరు కాపులను దువ్వుతూ, ఆందోళనను అణిచివేస్తూ..ఇలా రకరకాలుగా చంద్రబాబునాయడు ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది.