మళ్ళీ ముద్రగడకు గృహ నిర్భంధం

First Published Nov 15, 2016, 4:16 PM IST
Highlights

తాను చేయదలచుకున్న సత్యాగ్రహ యాత్రకు పోలీసుల అనుమతి అవసరం లేదని స్పష్టం చేసారు.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను ప్రభుత్వం మళ్ళీ గృహ నిర్భధం చేసింది. 48 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు. కాపులను బిసిల్లోకి చేర్చాలన్న డిమాండ్ తో ముద్రగడ కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తన స్వగ్రామమైన కిర్లంపూడి నుండి అంతర్వేది వరకూ ఐదు రోజుల పాటు పాదయాత్ర చేయాలని సంకల్సించారు.

 

 అయితే, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న కారణంతో పోలీసులు యాత్రకు అనుమతి ఇవ్వలేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ముద్రగడ మద్దతు దారులు కిర్లంపూడికి చేరుకుంటున్నారు. దాంతో పోలీసులు పై గ్రామం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాకుండా అడుగడుగునా నిఘా ఏర్పాటు చేసారు.

 

 దాంతో పోలీసుల చర్యపై మండిపడిన ముద్రగడ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా తన యాత్ర కొనసాగుతుందని ప్రకటించారు. బుధవారం నుండి యాత్ర మొదలవ్వాల్సి ఉండగా మంగళవారం రాత్రి పోలీసులు ముద్రగడను గృహనిర్భంధంలోకి తీసుకున్నారు. తన నివాసం నుండి ముద్రగడను బయటకు రాకుండా మరెవరూ ఆయన ఇంట్లోకి పోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేసినట్లు జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ ప్రకటించారు.

 

  ఇదే విషయమై ముద్రగడ మాట్లాడుతూ, తనను 48 గంటల పాటు గృహనిర్భందంలో ఉంచుతున్నట్లు పోలీసులు చెప్పటం పట్ల మండిపడ్డారు. తాను చేయదలచుకున్న సత్యాగ్రహ యాత్రకు పోలీసుల అనుమతి అవసరం లేదని స్పష్టం చేసారు. తన పాదయాత్రకు హై కోర్టు కూడా సానుకూలంగా స్పందించిన విషయాన్ని ముద్రగడ గుర్తుచేసారు.

 

 ఇదిలావుండగా, ముద్రగడ పాదయాత్రకు ముందస్తు అనుమతి  తీసుకోని కారణంగానే ఆయన్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ ప్రకటించారు. అనుమతి కోసం దరఖాస్తు చేస్తే పరిశీలిస్తామని కూడా చెప్పారు.

click me!