
14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ (1325-1351)లాగా నోట్ల మంట పెట్టి ప్రధాని మోదీ కూడా చేతులు కాల్చుకున్నారని అనిపిస్తుంది.
రెండు విపత్కర నిర్ణయాలను తీసుకుని చరిత్రలో విధూషకుడిగా మిగిలిపోయిన చక్రవర్తి తుగ్లక్ ఒక్కరే. ఆయన చాలా దూరదృష్టితో ఈ నిర్ణయాలను తీసుకున్నానని చెప్పినప్పటికి, తుగ్లక్ దెబ్బ ఢిల్లీ ప్రజలను చావు దెబ్బతీసింది. ఇందులో మొదటి నిర్ణయం రాజధానిని ఢిల్లీనుంచి ఎక్కడో దౌలతాబాద్ కు మార్చడం.
దేశంలో నడిబొడ్డున రాజధాని వుంటే శత్రువులు దాడి చేయరనే ఉద్దేశంతో ఆయన రాజధాని ఇప్పటి మహారాష్ట్రలో ఉన్న దౌలతాబాద్ కు 1329 లోమార్చడమే కాదు,ఢిల్లీ వాసులంతా అక్కడి వలసపోవల్సిందే అన్నారు.
ఇలాంటిదే ఆయన ప్రవేశ పెట్టిన టంక నిర్ణయం. బహుశా టంకశాల అనేమాట ఆయన టంకాలు ముద్రించడం వల్లే వచ్చిందేమో. మొదట ఢిల్లీ సామ్రాజ్యంలో బంగారు, వెండి నాణెంలు చెలామణిలో ఉండేవి. ఆయన యుద్ధాలకయ్యే ఖర్చు భరించడం కష్టంగా ఉంది. నాణేల కొరత ఏర్పడింది.దీనిని అధిగమించాలనుకున్నారు.
అదేసమయంలో చైనా లో కుబ్లాయ్ ఖాన్ పేపర్ కరెన్సీ విడుదల చేశాడు. దీని నుంచి ప్రేరణ పొందిన తుగ్గక్ బంగారు నాణేలతో సమానమయిన రాగి నాణేలను విడుదల చేశాడు. అంతేకాదు, ఈ నాణేలను ఎవరైనా ముద్రించుకునే స్వేఛ్చ కూడా ఇచ్చాడు. వాటిని మార్చుకుని ఖజానానుంచి వెండి నాణేలు తీసుకోవచ్చని కూడా చెప్పారు. దీనితో స్వర్ణకారులు పెద్ద మొత్తంలో రాగినాణేలు తయారుచేశారు. నాణేలు ఎక్కువయి మార్కెట్లో చెల్ల కుండా పోయాయి. చివరకు తొందర్లోనే టంకా టోకెన్ కరెన్సీని నిలుపుదల చేయాల్సివచ్చింది.
అంతేకాదు, ప్రజలు తమ దగ్గిర ఉన్న రాగినాణేలతో ప్రభుత్వం నుంచి వెండి నాణేలు మార్చుకోవచ్చని చెప్పినందున ప్రజలు ఎగబడి రాగినాణేలు ఇచ్చి వెండినాణేలు మార్చుకున్నారు. కళ్ల ముందే ఇప్పటి ఎటిఎంలు, బ్యాంకుల లాగా ఖజానా ఖాళీ అయిపోయింది. చెల్లని రాగినాణేలు రోడ్లకటు ఇటు కుప్పలుకుప్పలుగా పడి ఉన్నాయని చరిత్ర కారులు చెబుతారు. ఇపుడిదే పరిస్థితి దాదాపు ఎదురవుతోంది. పేద, మధ్య తరగతి ప్రజల దగ్గిర ఉన్న పాత అయిదొందలు, వేయి నోట్ల రోడ్ల మీదకు వెదజల్లే పరిస్థితి ఎదురవుతూ ఉంది.