
పల్నాడు : చేతి కంది వచ్చిన కొడుకును చంపేసిన హంతకులను పథకం ప్రకారం అంతమొందిస్తోంది ఓ తల్లి. 15 ఏళ్ల క్రితమే భర్త చనిపోగా.. కొడుకుల ఆసరాగా బతుకుతున్న ఆమె ప్రతీకార జ్వాలతో రగిలిపోయింది. కొద్ది నెలల క్రితం ఒకరిని హత మార్చగా మంగళవారం రాత్రి మరో నిందితుడిని కిరాతకంగా హతమార్చింది. ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన కథనం ఈ మేరకు ఉంది…
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జాన్ బీ అనే మహిళ భర్త షబ్బీర్ 15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి ఇద్దరు కుమారులు. భర్త మరణించిన తర్వాత కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇద్దరు కుమారులతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో స్థానికులైన ఖాసీం, రౌడీ షీటర్ షేక్ బాజీ (36)లతో చనువు ఏర్పడింది. అయితే… వారు తల్లితో సన్నిహితంగా ఉండడం జాన్ బీ పెద్ద కొడుకుకు నచ్చలేదు. దీంతో వారిద్దరిని తమ ఇంటికి రావద్దంటూ హెచ్చరించాడు.
ఖాసిం, షేక్ బాజీలకు అది నచ్చలేదు. తమకు జాన్ బీ పెద్ద కొడుకు అడ్డుగా ఉన్నాడని కక్ష కట్టారు. 2021 ఆగస్టులో షేక్ బాజీ, ఖాసింలు మరో ముగ్గురు స్నేహితుల సహాయంతో జాన్ బీ పెద్దకొడుకును గొంతు కోసి.. అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ సమయంలో కొడుకును హత్య చేసిన వారిని అంతే కిరాతకంగా చంపుతానని… కోపంతో రగిలిపోతున్న జాన్ బీ ప్రతిజ్ఞ చేసింది.
చేపలు పట్టడానికి వెళ్లి... అర్థరాత్రి బోటునుంచి జారి పడి..12 గంటలపాటు సముద్రంలోనే ఈతకొడుతూ...
ఈ హత్యల కోసం పక్కా ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా నరసరావుపేటలోని సినిమా హాల్ కూడలిలో .. ప్రధాన నిందితుడైన ఖాసిం మత్తులో ఉండగా 2021 డిసెంబర్లో చంపేసింది. దీనికోసం తన తమ్ముడు హుస్సేన్, చిన్న కుమారుడి సహాయం తీసుకుంది. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. ఈ కేసులో కొద్ది కాలం క్రితమే బెయిలుపై బయటికి వచ్చింది.. ఆ తర్వాత రెండో నిందితుడైన బాజీ హత్యకు పథకం వేసింది.
కొడుకు మృతదేహం సాక్షిగా జాన్ బీ చేసిన శపధం గురించి తెలిసిన రౌడీషీటర్ బాజీ ఆమె కంటపడకుండా ఏడాదిన్నరగా అజ్ఞాతవాసం చేస్తున్నాడు. బాజీ ఇప్పటికే మూడు హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. జాన్ బీ.. బాజీ కోసం పట్టువదలకుండా ప్రయత్నం చేసింది. అతని ఫోన్ నెంబర్ సంపాదించింది. ఆ తర్వాత అతడికి ఫోన్ చేసి.. వలపు వల విసిరింది.
పాత గొడవలు మరిచిపోయి గతంలో మాదిరి కలిసి ఉందామని నమ్మించింది. తాను ఒంటరిగా ఉంటున్నానని వయ్యారాలు పోయింది. తమ్ముడు పుట్టినరోజు అని.. పార్టీ చేసుకుందాం రమ్మంటూ ఆహ్వానించింది. బాజీ అది నిజమేనని నమ్మాడు. మంగళవారం రాత్రి జాన్ బీ దగ్గరికి వచ్చాడు. అయితే, అప్పటికే జాన్ బీ తమ్ముడు హుస్సేన్, అతని మిత్రులు గోపికృష్ణ, హరీష్ లతో కలిసి బాజీ హత్యకు ప్రణాళిక రూపొందించింది.
ఈ పథకం ప్రకారం బాజీని సమీప గుట్టల్లోకి తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగించింది. ఆ తర్వాత పూర్తిగా మత్తులోకి జారుకున్న అతడి మీద నలుగురు కలిసి కత్తులతో దాడి చేసి చంపేశారు. శవాన్ని మాయం చేయాలని పెట్రోల్ పోసి దహనం చేశారు. ఆ ప్రయత్నం ఫలించలేదు. సగమే కాలడంతో.. ఆ మృతదేహాన్ని అక్కడే గుంత తీసి పాతేశారు.
ఆ తర్వాత బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లి.. హత్య చేసిన విషయం చెప్పి లొంగిపోయారు. దీంతో ఖంగుతిన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం నరసరావుపేట గ్రామీణ సీఐ భక్తవత్సల రెడ్డి, ఎస్సై బాలనాగిరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ పూడ్చి పట్టిన బాజీ మృతదేహాన్ని వెలికి తీయించి పంచనామా చేశారు. బాజీకి భార్య, ఓ కూతురు, ఇద్దరు కొడుకులున్నారు.