దోమల నియంత్రణకు చట్టమా ?

First Published Jan 13, 2017, 4:00 AM IST
Highlights

ఎవరి ఇంటిముందైనా దోమల గుడ్ల వృద్ధి కనిపిస్తే సదరు ఇంటి యజమానికి జరిమానా విధిస్తారట. దోమల గుడ్లేమన్నా కోడిగుడ్లా కంటికి కనిపించటానికి?

దోమల నియంత్రణకు ప్రభుత్వం త్వరలో చట్టం తేవటానికి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్ని చైతన్య యాత్రలు చేపట్టినా, చివరకు ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా ఏకంగా యుద్ధమే చేసినా దోమల నియంత్రణ సాధ్యం కాలేదు. కోట్ల రూపాయలైతే వదిలింది కానీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. దాంతో దోమల నియంత్రణకు శ్రీలంక తరహా చట్టం తేవటమొకటే మార్గమని నిర్ణయించింది.

 

త్వరలో వస్తుందనుకుంటున్న చట్టం ప్రకారం ఎవరి ఇంటిముందైనా దోమల గుడ్ల వృద్ధి కనిపిస్తే సదరు ఇంటి యజమానికి జరిమానా విధిస్తారట. దోమల గుడ్లేమన్నా కోడిగుడ్లా కంటికి కనిపించటానికి? ఏమిటో ప్రభుత్వం ఆలోచన ఎవరికీ అర్ధం కాదు. అలాగే, దోమల వృద్ధి చెందినట్లు అధ్యయనాల్లో తేలినా మున్సిపాలిటీలు, పంచాయితీలకు కూడా జరిమానాలు వేయాలని చట్టంలో ఉందట.

 

దోమలపై ప్రభుత్వం గతంలో ప్రకటించిన యుద్ధం పెద్ద ప్రహసనంగా మారింది. పోయిన సంవత్సరం ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాలు పెరిగిపోయాయి. దోమలపై యుద్ధం కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 20 కోట్ల ఖర్చు చేసింది.

 

ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టింది. అందుకోసం 126 వాహనాలు వాడింది. 35,953 గ్రమాల్లో  బ్లీచింగ్ పౌడర్ చల్లింది. 3610 గ్రామాల్లో స్వచ్ఛ భారత్ సమావేశాలు నిర్వహించింది. 5,796 పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది. మురికికాల్వలు, నీళ్ళు నిల్వ లేకుండా చూసుకుంటే దోమల వృద్ధిని అడ్డుకోవచ్చని శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. అటువంటి కార్యక్రమాలు చేపడితే ఏమన్నా ఉపయోగాలుంటాయేమో ప్రభుత్వం చూడాలి.

 

 

click me!