ఇద్దరికీ ఒకేసారి షాకిచ్చిన మోడి

First Published Jul 18, 2017, 7:14 AM IST
Highlights
  • క్రియాశీల రాజకీయాల్లో నుండి దూరంగా వెళ్లటం అటు వెంకయ్యకే కాదు చంద్రబాబునాయుడు కూడా ఏమాత్రం మింగుడుపడనిదే.
  • ప్రత్యక్ష రాజకీయాల్లో నుండి పక్కకు పోవటం వెంకయ్యకు ఏమాత్రం ఇష్టం లేదు.
  • గడచిన మూడేళ్ళుగా చంద్రబాబుకు ఢిల్లీలో ఏ అవసరం వచ్చినా ఆదుకుంటున్నది వెంకయ్యే అన్న విషయం అందరికీ తెలిసిందే.
  •  అదే సమయంలో వెంకయ్య, చంద్రబాబు వ్యతిరేకులకు మాత్రం మోడి నిర్ణయం సంతోషం కలిగించేదే.

‘టు బర్డ్స్ ఎటే షాట్’ అనే నానుడి ఇంగ్లీష్ లో బాగా పాపులర్. ఆ నానుడి ప్రధానమంత్రి నరేంద్రమోడికి సరిగ్గా సరిపోతుంది. వెంకయ్యనాయుడుని ఉపరాష్ట్రపతిగా పంపటం అలాంటిదేనని రాజకీయవర్గాల్లో బాగా ప్రచారం జరుగుతోంది. అలా ఎందుకంటే, ప్రత్యక్ష రాజకీయాల్లో నుండి పక్కకు పోవటం వెంకయ్యకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నిర్ణయించింది స్వయంగా నరేంద్రమోడి కదా? ఇక చేయగలిగేదేముంటిది? అందుకే ఇష్టం లేకపోయినా అయిష్టంగానే అంగీకరించారు. దాంతో వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాలకు ఇక ఫులిస్టాప్ పడినట్లే.

అదే సందర్భంలో వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్ళటం ఏమాత్రం ఇష్టంలేని వ్యక్తి మరొకరున్నారు. ఆయనే చంద్రబాబునాయుడు. గడచిన మూడేళ్ళుగా చంద్రబాబుకు ఢిల్లీలో ఏ అవసరం వచ్చినా ఆదుకుంటున్నది వెంకయ్యే అన్న విషయం అందరికీ తెలిసిందే. చివరకు చంద్రబాబు ఇరుక్కున్న ‘ఓటుకునోటు’ కేసులో చంద్రబాబును రక్షించిందీ వెంకయ్యేనంటూ బాగా ప్రచారంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందేకదా?

గడచిన మూడేళ్ళల్లో ఎప్పటికప్పుడు ఆదుకుంటూ వస్తున్న వెంకయ్య ఒక్కసారిగా ఉపరాష్ట్రపతిగా వెళ్ళిపోవటమంటే చంద్రబాబుకు పెద్ద షాకే కదా? ఎందుకంటే, కేంద్రమంత్రి హోదా వేరు, ఉపరాష్ట్రపతి హోదా వేరు. కేంద్రమంత్రి హోదాలో ఏదో ఓ కారణంతో పొద్దున విజయవాడలోనూ, సాయంత్రం తిరుపతిలోనూ రాత్రికి హైదరాబాద్ లోనూ ఉండొచ్చు. శాఖాపరమైన కార్యక్రమాల ముసుగులో సొంతపనులూ చక్కబెట్టుకోవచ్చు. అదే ఉపరాష్ట్రపతి అయితే ఎక్కడబడితే అక్కడకు తిరిగే అవకాశం ఉండదు. దాంతో క్రియాశీల రాజకీయాల్లో బాగా బిజీగా ఉండే వెంకయ్య లాంటి వాళ్ళకు మోడి నిర్ణయం మింగుడుపడనిదే. అందునా సార్వత్ర ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సొంతపార్టీ, రాష్ట్రానికి దూరంగా ఉండాల్సి రావటం ఎవరికైనా బాధేకదా?

అదే సమయంలో వెంకయ్య, చంద్రబాబు వ్యతిరేకులకు మాత్రం మోడి నిర్ణయం సంతోషం కలిగించేదే. ఇప్పటికే వెంకయ్య-చంద్రబాబుల సాన్నిహిత్యం వల్ల వెంకయ్య  ఏపిలో భారతీయ జనతా పార్టీని టిడిపికి తోకపార్టీలాగా చేసేసారంటూ జాతీయ నాయకత్వానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. వెంకయ్యను రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టదంటూ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరించారని కూడా ప్రచారంలో ఉంది. ఇటువంటి నేపధ్యంలోనే వెంకయ్య కేంద్రమంత్రి పదవిని వదులుకోవాల్సి రావటమంటే చాలా చాలా ఇబ్బందే. రేపేదైనా అవసరమైతే చంద్రబాబుకు వెంకయ్య లాగ ఎవరు మద్దతిస్తారు?

 

 

 

 

 

 

 

 

 

click me!