
తెలుగుదేశం పార్టీ ఎంఎల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీకి దూరమైనట్లేనా? శనివారం నంద్యాలలో చంద్రబాబునాయుడు పర్యటించిన సంగతి తెలిసిందే కదా? ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చక్రపాణికి అసలు సమాచారమే ఇవ్వలేదట జిల్లా నేతలు. మొన్నటికిమొన్న రంజాన్ సందర్భంగా నంద్యాలలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సందర్భంలోనూ చక్రపాణికి సిఎం పర్యటన సమాచారం ఇవ్వలేదు.
నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా సోదరుడు శిల్పా మోహన్ రెడ్డిని ప్రకటించిన దగ్గర నుండి టిడిపిలో అందరూ చక్రపాణిరెడ్డిని అనుమానంగా చూస్తున్నారు. శిల్పా సోదరుల్లో ఒకరు ప్రతిపక్షం అభ్యర్ధి అవ్వటం, ఇంకోరు అదికారపార్టీలో ఉండటంతోనే సమస్యలు మొదలయ్యాయి. టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపుకు వేస్తున్న ప్రణాళికలన్నీ చక్రపాణి వైసీపీలోని తన సోదరునికి చేరవేస్తారనే అనుమానం నేతల్లో ఉన్నట్లుంది. అందుకనే ఎన్నిక విషయం కావచ్చు ఇతరత్రా సమావేశాలు కావచ్చు ఎందులోనూ చక్రపాణికి ఆహ్వనం అందటం లేదు.
ఎప్పుడైతే అందరూ తనను అనుమానంగా చూస్తున్నారో చక్రపాణి కూడా టిడిపి నేతలతో మనస్పూర్తిగా కలవలేకపోతున్నారు. దాంతో చక్రపాణికి పార్టీతో గ్యాప్ వచ్చేసింది. అందులో భాగమే చంద్రబాబు తాజా పర్యటనకు ఆహ్వానం అందకపోవటం. దాంతో చేసేది లేక ఎంఎల్సీ కూడా కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే చక్రపాణి త్వరలోనే టిడిపికి గుడ్ బై చెప్పేసి వైసీపీలోకి వెళ్ళక తప్పదేమో అని అనిపిస్తోంది.