
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ (BJP) సభలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా (MLA Roja) విమర్శించారు. విభజన హామీలు నెరవేర్చకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు తెలుగు దేశం, బీజేపీ మీద ఆగ్రహంగా ఉన్నారని.. సీఎం వైఎస్ జగన్ (YS Jagan) మీద కాదని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ, తెలుగుదేశం పార్టీలు తెలుసుకోవాలని చెప్పారు. బుధవారం ఎమ్మెల్యే రోజా.. తిరుమల శ్రీవారిని దర్శించుకన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని చంద్రబాబు, బీజేపీ కలిసికట్టుగా చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు.
రాష్ర్టం అప్పులు చేస్తుందన్న బీజేపీ నేతలకు.. కేంద్రం చేస్తున్న అప్పుల కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. టీడీపీ నాయకులు బీజేపీలో చేరారని.. వారు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివి బీజేపీ నేతలు ఉన్న పరువును పొగొట్టుకుంటున్నారని విమర్శించారు. సినిమా టికెట్ల అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని.. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్టుగా చెప్పారు.
ఇక, విజయవాడలో బీజేపీ మంగళవారం ప్రజా ఆగ్రహ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ, టీడీపీలకు బీజేపీ మాతమ్రే ప్రత్యామ్నాయంగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో బెయిల్‌పై బయట ఉన్న వ్యక్తులు త్వరలోనే జైలుకు వెళ్తారని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా వున్న సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌కు (polavaram project) అనుమతులు ఇచ్చామని జవదేకర్ తెలిపారు. అనుమతులు ఇచ్చి ఏడేళ్లవుతున్నా, ఇప్పటికీ పూర్తి కాలేదని ఆయన దుయ్యబట్టారు. నీటి పంపిణీ సైతం మొదలుకాలేదన్నారు. అమరావతి రాజధాని కట్టడానికి కూడా అనుమతులు ఇచ్చానని అది కూడా పూర్తి కాలేదంటూ జవదేకర్ ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ (trs), టీడీపీ (tdp) , వైసీపీ (ysrcp) పాలనలను చూశానని.. కుటుంబ నాయకత్వమే కనిపించిందన్నారు. రాజధాని కోసం వైసీపీ, టీడీపీ కొట్టుకుంటున్నాయని.. టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీలు కరప్షన్ పార్టీలని జవదేకర్ ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేశారని.. రామతీర్దంలో కోదండరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. ఏపీలో విధ్వంసకర పాలన జరుగుతోందని.. 2014లో మోడీ వేవ్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని జవదేకర్ అన్నారు. అయితే 2019లో బీజేపీతో దూరమై టీడీపీ ఓటమి పాలైందని ఆయన గుర్తుచేశారు.
బీజేపీ సభపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దీక్ష చేయడం వెనుక టీడీపీ భావజాలమే ఉందని, బీజేపీ ఉనికే లేదనీ, టీడీపీ అజెండానే బీజేపీ మోస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగున్నాయని తెలిపారు. రాజకీయంగా టీడీపీ పాటనే జనసేన బీజేపీ లు పడుతున్నాయని ఆరోపించారు. ఏపీలో రామరాజ్యం కావాలంటే.. వైసీపీని ఫాలో కావాలంటూ విపక్షాలకు చురకలంటించారు.