
మొత్తానికి కొందరు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు చంద్రబాబు దృష్టిలో పడ్డామనిపించుకున్నారు. డిజిటల్ లావాదేవీలకు చంద్రబాబునానయడు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయినట్లున్నారు. పురమాయించి మరీ మంత్రులు, ఐఏఎస్ అధికారుల చేత డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయిస్తున్నారు.
నగదు రహిత లావాదేవీలు చేయాల్సిందిగా సిఎం ఆదేశించిన తర్వాత తప్పదుకదా?
ప్రజలచేత ఎలాగైనా సరే క్యాష్ లెస్ లావాదేవీలు చేయాలనుకుంటున్నారు. అందుకని ముందు తన మంత్రులు, ఉన్నతాధాకారులతో మొదలుపెట్టారు. మూడు రోజుల క్రితం జరిపిన సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారుల్లో ఎంతమంది డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నారో తెలుసుకోవాలని అనుకున్నారు.
అదే విషయాన్ని అక్కడే ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులను అడిగారు. వారి సమాధానంతో సిఎం విస్తుపోయారు. అక్కడున్న వారిలో పెద్దగా ఎవరూ డిజిటల్ లావాదేవీల పట్ల మక్కువ చూపటం లేదని తెలుసుకున్నారు.
మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో 20 శాతం కూడా డిజిటల్ లావాదేవీలు నిర్వహించటం లేదని తెలిసి అందరిపైనా మండిపడ్డారు. ఆ తర్వాత జరిగిన వివిధ సమీక్షల్లో మాట్లాడుతూ, డిజిటల్ లావాదేవీల పట్ల ప్రజలు మక్కువ చూపటం లేదని గ్రహించారు. అదే విషయాన్ని ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో చెబుతూ వెంటనే చిన్న నోట్లను పంపాల్సిందిగా గట్టిగా చెప్పారు.
బుధవారం మొదలైన రెండు రోజుల కలెక్టర్ల సమావేశాల్లో మళ్ళీ డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి మొదలుపెట్టారు. నగదు రహిత లావాదేవీల్లో ఉన్న సౌలభ్యాల గురించి ఊదరగొట్టారు. పనిలో పనిగా మంత్రులు, ఐఏఎస్ అధికారులను నగదు రహిత లావాదేవీలు చేయాల్సిందిగా పంపించారు.
సిఎం ఆదేశాలతో వెంటనే మంత్రులు గంటా శ్రీనివాస్, పరిటాల సునీత, శిద్దా రాఘవరావు, పల్లె రఘునాధరెడ్డితో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు ఆధార్ కార్డులు, క్రెడిట్ కార్డులతో షాపింగులు చేసి సందడి చేసారు.