
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. హిందూపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేడు సభకు వచ్చారు. అయితే బాలకృష్ణ అసెంబ్లీ హాజరైన సమయంలో సందడి వాతావరణం నెలకొంది. బాలకృష్ణను మంత్రలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్ పలకరించారు. ‘‘ఏం హీరో గారు..’’అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ.. బాలకృష్ణకు అభివాదం చేశారు. ఇక, మంత్రి అమర్‌నాథ్‌తో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈరోజు కోటు వేసుకురాలేదంటూ సరదాగా కామెంట్ చేశారు.
మరోవైపు టీడీపీ నేతలతో బాలకృష్ణ చిట్ చాట్ నిర్వహించారు. తాజా రాజకీయాలు, రోడ్ల పరిస్థితి గురించి వారి నుంచి సమాచారం తీసుకున్నారు. అలాగే అసెంబ్లీకి వెళ్లే రోడ్లను కూడా బాలకృష్ణ పరిశీలించారు. టీడీపీ సభ్యులతో కలిసి ఫ్లకార్డు చేతబట్టి బాలకృష్ణ నిరసనను తెలియజేశారు. అమరావతిలో దెబ్బతిన్న రోడ్లను చూస్తుంటే బాధేస్తుందని బాలకృష్ణ అన్నారు. రైతులు పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం బాధకరమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో.. వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు. అలా సభలో నుంచి సస్పెండ్ అయినవారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత మంత్రి బుగ్గన తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.