
కర్ణాటక : బెంగళూరులో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు మడివాళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంతో కారు డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళకి చెందిన కార్తీక్ (23) బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూరులోని కోరమంగలలో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటూ ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన భగీరథరెడ్డి (17) బెంగళూరులోని ఒక ప్రైవేట్ కాలేజీలో పీయూసీ చదువుతున్నాడు. అతను కూడా కార్తీక్ ఉండే హాస్టల్లోనే ఉంటున్నాడు. ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో ఇద్దరు మధ్య స్నేహం ఉండేది. ఈ క్రమంలోనే మంగళవారం కార్తీక్ తన కారులో భగీరథరెడ్డితో కలిసి రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ నుంచి బయలుదేరారు.
నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం..!
కారును అత్యంత వేగంగా నడుపుతూ వెళ్లడంతో సిల్క్ బోర్డు సమీపంలోకి వచ్చేసరికి కారు అదుపుతప్పింది. రోడ్డు డివైడర్ను ఢీ కొట్టింది. అక్కడినుంచి ఎగిరి అవతలి లైన్ లో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న కార్తీక్, భగీరథరెడ్డి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే వీరిద్దరిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే ప్రమాదానికి సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు.
అయితే, ఆసుపత్రికి తరలించేసరికే కార్తీక్, భగీరథరెడ్డి ఇద్దరు మృతి చెందారు. వేగంగా వచ్చి కారు ఢీకొనడంతో బస్సులోని కొంతమందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం సమాచారంతో అక్కడికి చేరుకున్న మడివాళ ట్రాఫిక్ పోలీసులు దీనిమీద కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. కార్తీక్, భగీరథరెడ్డి మృతదేహాలను సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. ఉన్నత చదువులు చదువుకొని జీవితాల్లో స్థిరపడతారు అనుకున్న తమ కుమారులు.. ఇలా అనుకోని పరిణామాల కారణంగా మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి.