
అధికార తెలుగుదేశంపార్టీ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేయవద్దని రాజధాని ప్రాంత రైతులు ఎవరో ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేయటమన్నది తాజా రచ్చకు కారణం. అయితే, ఫిర్యాదు చేసిన రైతులు ఎవరో తెలీదు. కానీ రైతుల పేరుతో ఫిర్యాదు మాత్రం వెళ్ళిందన్న విషయాన్ని మంత్రులు ధృవీకరిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు వెళ్లింది కాబట్టి ప్రతిపక్ష వైసీపీ పనే అంటూ మంత్రులు జగన్మోహన్ రెడ్డిపై మండిపోతున్నారు.
ఫిర్యాదు గురించి పేర్కొన్న మంత్రులు జగన్ అరాచకానికి పరాకాష్టగా పేర్కొంటున్నారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసారట. కాబట్టి అదే అలవాటు ఇపుడు జగన్ కు కూడా అబ్బిందన్నది మంత్రుల వాదన. ప్రపంచబ్యాంకులోని ఫిర్యాదుల విభాగానికి నేరుగా ఫిర్యాదు చేసారంటే మామూలు రైతులకు సాధ్యం కాదట. రైతుల వెనుక ఎవరో ఉండి వారి పేర్లతో ఫిర్యాదులు చేసారని మంత్రులు అంటున్నారు.
రైతుల వెనుక ఎవరో అంటే ఇంకెవరు, జగనే అని మంత్రులు తేల్చేసారు. దానికి సాక్ష్యం జగన్ గతంలో చేసిన దురాగతాలేనట. తునిలో రైలు తగలబెట్టించాడట. రాజధాని ప్రాంతంలోని రైతుల పొలాలు తగలబెట్టించాడట. విజయవాడలో మహిళా సదస్సును, విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సును అడ్డుకునే ప్రయత్నాలు చేసాడట. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళితే, పెట్టుబడిదారులను అడ్డుకునేందుకు అమెరికా పోలీసులకు తప్పుడు ఈ మెయిల్స్ పంపింది కూడా జగనేట. హరిత ట్రైబ్యునల్ కు వెళ్ళి రాజధాని నిర్మాణం కేసులు వేయించింది కూడా జగనే అని మంత్రులు ధ్వజమెత్తారు.
ఇన్ని పనులు చేయించింది జగనే కాబట్టి తాజా ఫిర్యాదు వెనుక ఉన్నది కూడా జగనే అని మంత్రులు యనమల, సోమిరెడ్డితో పాటు మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తీర్మానించేసారు. మంత్రులు చెప్పిన ఘటనల వెనుక జగన్ పాత్ర ఉందని ఏ ఒక్క విచారణలోనూ నిరూపితం కాలేదు. అయినా జగనే చేయించాడని మంత్రులు చెప్పేస్తున్నారు. నిజంగానే వైసీపీ ఆపని చేయించి ఉంటే జగన్ తప్పు చేసినట్లే. కానీ ఆధారాలు లేకుండా కేవలం అనుమానాలతోనే అన్నింటికీ జగనే కారణమంటూ మంత్రులు ముద్రవేసేస్తే ఎలాగ?