వైసీపీ ఎంఎల్ఏల పైనే గురి ?

First Published Jun 28, 2017, 6:49 AM IST
Highlights

నంద్యాల ఉపఎన్నికలు మొదలయ్యే సమయానికి వీలైనంతమంది ప్రతిపక్ష ఎంఎల్ఏలపై కేసులు నమోదు చేస్తే అవసరం వచ్చినపుడు అరెస్టులు చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. దాంతో ఉపఎన్నికల సమయంలో వైసీపీకి ఎంఎల్ఏలు ప్రచారం చేసే అవకాశం ఉండదు. ఆ విధంగా ప్రతిపక్షాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి అందరిలోనూ.

ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే వైసీపీ ఎంఎల్ఏల విషయంలో వ్యూహాత్మకంగానే అడుగులేస్తున్నట్లు కనబడుతోంది. నంద్యాల ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకునే గట్టి వ్యూహాలే పన్నుతున్నట్లు అనుమానం వస్తోంది. వైసీపీకి చెందిన ఎంఎల్ఏల్లో వీలైనంతమందిని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచే పన్నాగమేమైనా ఉందా అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, మొన్ననే చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసారు.

సరే కేసంటూ నమోదు చేసిన తర్వాత ఎప్పుడైనా అరెస్టులు చేయవచ్చు కదా? సి రామాపురం గ్రామంలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో పాటు ఎంఎల్ఏ కూడా ఆందోళన చేసారు. అందరిపైనా కేసులు పెట్టి అరెస్టులు చేసి రిమాండ్ కు పంపారు. నిజానికి గ్రామస్తులపైన కానీ ఎంఎల్ఏపైన కానీ కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అయినా పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేయటం గమనార్హం.

ఇక, రాజధాని గ్రామాల్లో ఒకటైన పెనుమాకలో సిఆర్డిఏ అధికారులు గ్రామసభ నిర్వహించారు. సభలో వ్యక్తమైన అభిప్రాయాలను మినిట్స్ బుక్ లో రికార్డు చేయాలంటూ రైతులు, స్ధానికులు పట్టుబట్టటంతో గొడవ మొదలైంది. అభిప్రాయాలను రికార్డు చేయాలని కోర్టు ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. దాంతో మండిపోయిన రైతులు, స్ధానికులు టెంట్లను పీకేసి, కుర్చీలను విసిరేసారు. అక్కడి నుండి వెళ్ళిపోయిన అధికారులు రాత్రి రైతులు, మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు అరెస్టులు చేయకుండా ఉంటారా?  

అయితే, ఇక్కడే ప్రభుత్వ చర్యలపై అనుమానాలు మొదలయ్యాయ. సి రామాపురం గ్రామంలోనైనా పెనుమాక విషయంలో అయినా కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అయినా పోలీసులు ఎంఎల్ఏలపైన కూడా కేసులు పెట్టారంటేనే సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి. నంద్యాల ఉపఎన్నికల సమయానికి వీలైనంతమంది వైసీపీ ఎంఎల్ఏపై కేసులు నమోదు చేయాలని అనుకుంటున్నట్లు కనబడుతోంది.

ఎందుకంటే, నంద్యాల ఉపఎన్నికలు మొదలయ్యే సమయానికి వీలైనంతమంది ప్రతిపక్ష ఎంఎల్ఏలపై కేసులు నమోదు చేస్తే అవసరం వచ్చినపుడు అరెస్టులు చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. దాంతో ఉపఎన్నికల సమయంలో వైసీపీకి ఎంఎల్ఏలు ప్రచారం చేసే అవకాశం ఉండదు. ఆ విధంగా ప్రతిపక్షాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి అందరిలోనూ.

click me!