వైరల్ ఫీవర్‌తోనే చిన్నారి సంధ్య మృతి.. అన్నింటినీ రాజకీయం చేయొద్దు : టీడీపీపై మంత్రి రజనీ ఫైర్

By Siva KodatiFirst Published Sep 20, 2022, 8:37 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు మంత్రి విడదల రజనీ.  వైరల్ వ్యాధితో చిన్నారి సంధ్య మరణించినందన్న ఆమె దీనిని కూడా టీడీపీ రాజకీయం చేయడం దారుణమన్నారు. విష జ్వరాల కట్టడిపై పటిష్ట చర్యలను తీసుకున్నామని రజనీ చెప్పారు. 

ఆరోగ్యశ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ.. విష జ్వరాల కట్టడిపై పటిష్ట చర్యలను తీసుకున్నామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి చేర్చామని విడదల రజనీ తెలిపారు. మలేరియా, డెంగీ వంటి జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో డబ్బులను దుర్వినియోగం చేసిందని.. వైరల్ వ్యాధితో చిన్నారి సంధ్య మరణించడంపై రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కూడా టీడీపీ రాజకీయం చేయడం దారుణమన్నారు. 

అంతకుముందు వైద్య రంగంలో నాడు-నేడుతో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు వైద్యరంగాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం చూశామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్ లైటింగ్‌లో ఆపరేషన్‌లు చేయడం గతంలో చూశామని సీఎం తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నామని.. దివంగత నేత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారని జగన్ గుర్తుచేశారు. పేదలకు ఆరోగ్య భరోసా అందించేందుకు చర్యలు తీసుకున్నామని సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందని.. నెట్‌వర్క్ ఆసుపత్రుల బిల్లులను గత ప్రభుత్వం చెల్లించలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలన్నీ చెల్లించిందని సీఎం వెల్లడించారు. 

ALso Read:ఏపీ వైద్య రంగంలో భారీ మార్పులు.. త్వరలో వైఎస్సార్ విలేజ్ క్లీనిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్లు : అసెంబ్లీలో జగన్

5 లక్షల లోపు ఆదాయం వున్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని.. ప్రస్తుతం 90 శాతం మంది ఆరోగ్యశ్రీ పరిధిలో వున్నారని జగన్ తెలిపారు. ఆసుపత్రుల్లో నాడు నేడు కోసం రూ.16,255 కోట్లు ఖర్చు చేశామని.. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లీనిక్ ఏర్పాటు చేస్తున్నామని... ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సలను 3,118కి పెంచామని జగన్ పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నామని.. తమ ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో 45 వేల పోస్టులను భర్తీ చేశామని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని.. మెడికల్ కాలేజీల కోసం రూ. 12,268 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. 
 

click me!