మాజీ మంత్రి నారాయణకు ఊరట... లుక్‌ ఔట్ నోటీసుల ఎత్తివేతకు ఏపీ హైకోర్టు ఆదేశం

By Siva KodatiFirst Published Sep 20, 2022, 6:16 PM IST
Highlights

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణపై గతంలో జారీ చేసిన లుకౌట్ నోటీసులను తొలగించాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు మంగళవారం హైకోర్టు ఆదేశించింది. అలాగే డిసెంబర్ 22 నాటికి నారాయణ అమెరికాలో పని చేసుకుని తిరిగి భారత్‌కు వచ్చేయాలని ధర్మాసనం ఆదేశించింది. 

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై గతంలో జారీ చేసిన లుకౌట్ నోటీసులను తొలగించాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌ను మంగళవారం హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ... లుకౌట్ నోటీసుల కారణంగా నారాయణ అమెరికాకు వెళ్లలేకపోతున్నారని ఆయన తరప న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు నారాయణపై లుక్ ఔట్ నోటీసులు తొలగించాలని ఆదేశించింది. అలాగే డిసెంబర్ 22 నాటికి నారాయణ అమెరికాలో పని చేసుకుని తిరిగి భారత్‌కు వచ్చేయాలని ధర్మాసనం ఆదేశించింది. 

ఇకపోతే... అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణకు సహచరులుగా భావిస్తున్న ఐదుగురిని సీఐడీ గత మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడకు చెందిన కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, విశాఖపట్నం‌కు చెందిన చిక్కాల విజయ సారధి, బడే ఆంజనేయులు, కొట్టి కృష్ణ దొరబాబులను అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారిక ప్రకటనలో తెలిపింది. అరెస్టు చేసిన వారిని సీఐడీ.. ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

ALso REad:అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్ల కేసు.. మాజీ మంత్రి నారాయణకు మూడు నెలల ముందస్తు బెయిల్..

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన యలమర్తి ప్రసాద్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో సీఐడీ అధకారులు నారాయణను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. నిందితులు ఎస్సీలకు ద్రోహం చేశారని, వారి అసైన్డ్ భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కు రాజ‌ధాని రాక‌ముందే కొనుగోలు చేశారని ప్రసాద్ కుమార్ ఆరోపించారు. అప్పుడు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా ఉన్న నారాయణ ఆదేశాల మేరకు నిందితులు ల్యాండ్‌ పూలింగ్‌పై ఎస్సీల్లో భయాందోళనలు సృష్టించారని ఫిర్యాదులో ఆరోపించారు. 

ఈ కేసులో కేసులో నారాయణకు హైకోర్టు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. నారాయణ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కోర్టుకు తెలిపారు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కింది కోర్టు మిగతా నిందితులకు సెక్షన్లు వర్తించివని,  రిమాండ్‌ను తిరస్కరించినట్లు తెలిపారు. 

click me!