దుర్గమ్మ రథంపై వెండిసింహాలు మాయం... దేవాదాయ మంత్రి ఏమన్నారంటే

By Arun Kumar PFirst Published Sep 16, 2020, 12:47 PM IST
Highlights

ఇంద్రకీలాద్రిపై వెలిసిన సాక్షాత్తూ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలోని వెండి రథంపై ఉన్న నాలుగు సింహాల్లో మూడు మాయం కావడంపై  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. 

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలిసిన సాక్షాత్తూ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలోని వెండి రథంపై ఉన్న నాలుగు సింహాల్లో మూడు మాయం కావడం వివాదంగా మారుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఇంద్రకీలాద్రికి వెళ్లి రథాన్ని పరిశీలించారు. దీంతో ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. 

''రధానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు కార్పెట్ ని తెరిచి చూసే సమయంలో సింహాలు కనిపించలేదు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఒక్కసారికూడా ఉపయోగించలేదు. ఈ సింహాల చోరీ గత ప్రభుత్వం హయాంలో జరిగిందో, ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుంది'' అని పేర్కొన్నారు. 

''ఈ ఘటనపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తాం. సెక్యూరిటీ ఏజెన్సీకి దేవాలయ భద్రత బాధ్యతలు అప్పగించాం. ఈ విషయంలో సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతాలోపం అని తేలితే దానిపై చర్యలు తీసుకుంటాం. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయి. అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లో భద్రతా చర్యలు తీసుకుంటున్నాం'' అని మంత్రి  వెల్లంపల్లి వివరణ ఇచ్చారు. 

read more  దుర్గగుడి రథం సింహాల ప్రతిమలు మాయం: విచారణకు ఆదేశించిన జగన్ సర్కార్

బుధవారం ఉదయం ఈ విషయం గురించి తెలుసుకున్న వెంటనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బృందం ఆలయానికి వెళ్లి పరిశీలించారు.   కారువాక అనే కార్యక్రమంలో దుర్గగుడి దగ్గర ఉన్న రథానికి అత్యంత ప్రాధాన్యత ఉందని, అలాంటి రథానికి అసలు భద్రతే లేదని విచారం వ్యక్తం చేశారు. దుర్గమ్మ వెండి రథం సింహాల ప్రతిమలు మాయం అయ్యాయని, నాలుగు ప్రతిమల్లో మూడు కన్పించడంలేదని సోము వీర్రాజు అన్నారు. నాలుగోది కూడా ధ్వంసం చేసేందుకు యత్నించారని... ఇందులో ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 

ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్నాయని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు అన్నారు.  ఇవాళ గవర్నర్‌ను కలుస్తున్నామని... అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నామని చెప్పారు.

click me!