
విజయవాడ : తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం వైఎస్ జగన్ 'జగనన్నే మా భవిష్యత్' పేరిట వైసిపి నాయకులు, కార్యకర్తలను ప్రజల్లోకి పంపిస్తున్నారని... టిడిపి, జనసేన పార్టీలకు దమ్ముంటే ఇలా ఇంటింటికి వెళ్లి ఏం చేసారో చెప్పగలరా? అంటూ రోజా సవాల్ విసిరారు. వైసిపి ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందో చెబుతోందని... జగనన్నే మా భవిష్యత్ అని రాష్ట్ర ప్రజలు బలంగా చెబుతున్నారని అన్నారు. ఇలా చంద్రబాబు గత ఐదేళ్లలో ఏం చేసారో జనాల్లోకి వెళ్లి చెప్పే ధైర్యముందా? అని రోజా సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రిగా వుండి ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. లక్షల కోట్ల రాష్ట్ర ఆస్తులను బాబు నాశనం చేసాడని... సొంత నియోజకవర్గం కుప్పంకు కూడా ఆయన చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, సైతాన్ చంద్రబాబు అని మండిపడ్డారు. ఈసారి కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని మంత్రి రోజా జోస్యం చెప్పారు.
Read More ఆ రోజు ఇదే గడ్డపై అవమానించారు.. ఇప్పుడు పోలీసు సెక్యూరిటీతో మంత్రిగా వచ్చాను: చంద్రబాబుపై రోజా ఫైర్
ఇదిలావుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలవాలని అనుకుంటే ఆపగలమా? అంటూ రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వారిద్దరూ భవిష్యత్ లో కలవడం కాదు ఇప్పుడు కూడా కలిసే వున్నారని... ఈ విషయం ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని అన్నారు. పవన్ జనసేన పార్టీ బిజెపికి త్వరలోనే దూరమై టిడిపికి దగ్గరవుతుందంటూ మంత్రి రోజా పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ పై ప్రజలకు నమ్మకం లేదని... అందువల్లే రెండు చోట్ల పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవలేకపోయారని రోజా అన్నారు. అలాంటిది తమను ఓడిస్తామని పవన్ మాట్లాడటం విడ్డూరంగా వుందని రోజా అన్నారు.