
అగ్రిగోల్డ్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన అధికారపార్టీ ఎదురుడాడి మొదలుపెట్టింది. మంత్రి ప్రత్తిపాటి అగ్రిగోల్డ్ సంస్ధ భూములు కొనుగోలు చేసినట్లు ఆధారాలతో దొరికిపోవటంతో ఏం చేయాలో టిడిపికి అర్ధం కావటం లేదు. అందుకనే తాను తప్పించుకునేందుకు అధికార పార్టీ ఎదురుదాడి మొదలుపెట్టంది. మూడు రోజులుగా అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన విషయం అసెంబ్లీని కుదిపేసింది. భూములు కొనుగోలు చేసారంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేసారు. దాంతో ప్రత్తిపాటి మాట్లాడుతూ, తాను భూములను కొనుగోలు చేయలేదని చెప్పారు. అయితే, అక్కడితో విషయం ఆగకుండా సవాళ్లు-ప్రతిసవాళ్ళతో సభ దద్దరిల్లిపోయింది.
తాను భూములు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే జగన్ రాజీనామా చేస్తారా అంటూ ప్రత్తిపాటి సవాలు విసిరారు. ఇదే అంశంపై ప్రత్తిపాటికి మద్దతుగా ముందు మంత్రులు, తర్వాత ఎంఎల్ఏలు చివరగా చంద్రబాబునాయుడు నిలబడి జగన్ పై ఒత్తిడిపెంచారు. ఆ అంశంపైనే రెండు రోజులు సభలో ఏ కార్యక్రమం జరగలేదు. సవాళ్ళ-ప్రతిసవాళ్ళు విసురుకోవటంతోనే సభలో గందరగళం జరిగింది. ఏ అంశం మీద కూడా జగన్ను అధికార పార్టీ మాట్లాడనీయలేదు. దాంతో సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదంటూ జగన్ మీడియా సమావేశంపెట్టి ప్రత్తిపాటి భూముల కొనుగోలు పత్రాలను బయటపెట్టారు. దాంతో ఏం అధికార పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. ఏం సమాధాన చెప్పాలో అర్ధం కాలేదు.
దాంతో ఎదురుదాడినే మార్గంగా ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. అందుకనే వైసీపీ నేత పి. గౌతమ్ రెడ్డిపై ఆరోపణలు మొదలుపెట్టింది. అగ్రిగోల్డ్ భూములను గౌతమ్ కూడా కొనుగోలు చేసారంటూ ప్రత్తిపాటి ఆరోపణలు చేసారు. అయితే ప్రత్తిపాటి ఆరోపణలు గౌతమ్ ఖండిచేసారనుకోండి అది వేరే విషయం. తాను కొనుగోలు చేసిన భూములకు అగ్రిగోల్డ్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని విచారించిన సిఐడి గతంలోనే స్పష్టం చేస్తూ నివేదికను హై కోర్టుకు కూడా అందచేసిందన్నారు. దొరికిపోయిన ప్రత్తిపాటి తప్పించుకునేందుకు తనపై ఆరోపణలు చేస్తున్నట్లు గౌతమ్ స్పష్టం చేసారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రత్తిపాటిపై పరువునష్టం దావా వేయనున్నట్లు కూడా గౌతమ్ చెప్పటం విశేషం.