రైల్వేజోన్ కోసమే ఆత్మగౌరవ యాత్ర

First Published Mar 25, 2017, 9:03 AM IST
Highlights

ఉత్తరాంధ్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తాను పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు అమరనాధ్ స్పష్టం చేసారు.

విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వేజోన్ డిమాండ్ తో త్వరలో వైసీపీ ‘ఆత్మగౌరవయాత్ర’ చేపడుతోంది. వైసీపీకి చెందిన అనకాపల్లి నేత, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు జి అమరనాధ్ ఈ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. రైల్వేజోన్ అవసరాన్ని కేంద్రం గుర్తించేం విధంగా  తనతో కలసివచ్చే రాజకీయా పార్టీలతో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే వామపక్షాలు, మిత్రపక్షాలైన టిడిపి, భాజపాలతో పాటు లోక్సత్తా పార్టీల నేతలను కూడా వ్యక్తిగతంగా కలుసుకుని మద్దతు కోరారు.

ఈనెల 30వ తేదీన అనకాపల్లిలో మొదలయ్యే పాదయాత్ర ఏప్రిల్ 9వ తేదీన భీమిలీలో ముగుస్తుంది. పై రెండు నియోజకవర్గాల మధ్య ఉన్న 60 డివిజన్లను కవర్ చేస్తూ 8 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనున్నది. పాదయాత్రలో భాగంగా అమర్ 213 కిలోమీటర్లను కవర్ చేయనున్నారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేకరైల్వే జోన్ ఏర్పాటు అవసరాన్ని తన యాత్రలో జనాలకు తెలియజేయనున్నారు.

అనకాపల్లిలో యాత్ర ప్రారంభానికి వైసీపీ నేతలైన బొత్సా సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో పాటు అంబటి రాంబాబులు హాజరవ్వనున్నారు. యాత్ర ముగింపురోజు భీమిలో జరుగనున్న బహిరంగసభకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశాలున్నాయి. యాత్రలో ప్రతీ డివిజన్, నియోజకవర్గంల్లోని స్ధానిక నేతలను కలుపుకుంటూ, రాజకీయాలకు సంబంధంలేని ప్రముఖులను కూడా కలుపుకుని వెళ్ళేట్లుగా అమర్ ప్లాన్ చేసారు. రైల్వేజోన్ కోసం పోరాటాలు చేస్తున్న వివిధ ప్రజాసంఘాలు, వేదికలను కూడా ఒకే గొడుగుక్రిందకు తీసుకురవాటం ద్వారా ప్రజాకాంక్షను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళటమే తన ధ్యేయంగా అమర్ చెబుతున్నారు.

అదే విషయాన్ని అమర్ నాధ్ ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ, ప్రత్యేక రైల్వేజోన్ డిమాండ్ అన్నది 5 దశాబ్దాల కలగా అభివర్ణించారు. 1960ల్లోనే విశాఖ పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి విశ్వనాధం ప్రత్యేకరైల్వేజోన్ అవసరాన్ని కేంద్రానికి తెలియజేసారన్నారు. అప్పటి నుండి పోరాటాలు జరుగుతున్నా కేంద్రంలో పెద్దగా కదలిక లేదని వాపోయారు. విశాఖపట్నంను కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు అన్నీ విధాలుగా వాడుకున్నాయే గానీ ఏ పార్టీ కూడా విశాఖపట్నానికి ఉపయోగపడలేదన్నారు.

విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వేజోన్ ఏర్పాటైతే విశాఖపట్నం చుట్టుపక్కల 16 కీలకమైన విభాగాలు కొత్తగా ఏర్పాటవుతాయని చెప్పారు. రైల్వేలకు అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ తదితర విభాగాల ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 45 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా మరో లక్షమందికి ఉపాధి కూడా దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ రోజు సికింద్రాబాద్ అభివృద్ధి జరిగిందంటే కేవలం రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్ లో ఏర్పాటవ్వటమేనని అమర్ అభిప్రాయపడ్డారు.

ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే విశాఖకు ప్రత్యేకరైల్వేజోన్ ఏర్పాటవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో గనుక ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పైతే ఉత్తరాంధ్ర మొత్తం మీద లక్షాలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి లభిస్తుందన్నారు. అదే విధంగా ఉత్తరాంధ్రనుండి ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న లక్షలాదిమంది కూలీలకు స్ధానికంగానే ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తాను పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు అమరనాధ్ స్పష్టం చేసారు.

 

 

click me!