
టీడీపీ , జనసేనలపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆదివారం అనంతపురం జిల్లా నాగిరెడ్డిపల్లెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ- జనసేన పొత్తులు పెట్టుకుంటే వైసీపీ భయపడదని.. రాజకీయంగా తాము టీడీపీలాగా ఊతకర్ర పట్టుకుని నడిచే పరిస్ధితుల్లో లేమని మంత్రి చురకలంటించారు. పవన్ కల్యాణ్ పోటీ చేసే ముందు .. ఆయన గెలుస్తారో లేదో ఆలోచించుకోవాలని పెద్దిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును సీఎంను చేసేందుకే పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారని రామచంద్రారెడ్డి ఆరోపించారు.
అంతకుముందు పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ పదికాలాల పాటు బాగుండాలనే పవన్ జనసేన పార్టీ స్థాపించారని అన్నారు. ఇప్పుడు కూడా అకాలవర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించడానికంటూ పవన్ చేస్తున్నది చంద్రబాబుకు అనుకూల రాజకీయమని అన్నారు. చివరకు చంద్రబాబు కోసం బరితెగించిన పవన్ అబద్ధాలు మాట్లాడుతున్నాడని నాని ఆరోపించారు.
Also Read: చంద్రబాబు కోసం ఎంతకు బరితెగించావు పవన్..: మాజీ మంత్రి నాని ఎద్దేవా
పవన్ కల్యాణ్ కు సినిమాలే ముఖ్యమని... రాజకీయాలు కేవలం చంద్రబాబు కోసమేనని పేర్ని నాని అన్నారు. అందుకే ఆరు నెలలకోసారి సినిమాల్లో ఖాళీ దొరికినప్పుడు వచ్చి జగన్ ను తిట్టడానికి రోడ్డుమీదకు వస్తున్నాడన్నారు.ఈ పదేళ్లలో పట్టుమని 10 రోజులు కూడా పవన్ ఏపీలో లేడంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేసారు. వారాహి వాహనం పేరిట హడావుడి చేసిన పవన్ కల్యాణ్ దసరా నుంచి రాష్ట్ర పర్యటన చేపడతానని అన్నాడని నాని గుర్తుచేసారు. దాన్ని వాయిదా వేసి మళ్లీ ఇప్పుడు జూన్ నుంచి రాష్ట్ర పర్యటన చేస్తానని అంటున్నాడని గుర్తుచేసారు. అది జరుగుతుందో లేదో డౌటేనని పేర్ని నాని అన్నారు.
రాజకీయాల్లో కులాల ప్రస్తావన తీసుకువచ్చి డివైడ్ ఆండ్ రూల్ పాలిటిక్స్ చేస్తున్నదే పవన్ అని మాజీ మంత్రి అన్నారు. కేవలం కాపులనే కాదు రాష్ట్ర ప్రజలందరినీ పవన్ తిడుతున్నాడని అన్నారు. చంద్రబాబు ముద్రగడ ను ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు? సీఎం జగన్ ను టీడీపీ పట్టాభి అనకూడని మాటలంటే మానవతావాదిగా ఎందుకు మాట్లాడలేదు? అంటూ పవన్ ను పేర్ని నాని ప్రశ్నించారు.