
వచ్చే ఏపీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పొత్తులు వుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బీజేపీ కీలక నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపామని నాదెండ్ల తెలిపారు. అయితే సీట్ల గురించి ఇంకా చర్చలు జరగలేదని..తమ అధినేత తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వుంటామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక ఒక మాట.. రాక ముందు మరో మాటను జనసేన మాట్లాడదని నాదెండ్ల తెలిపారు.
వైవీ సుబ్బారెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేయాలని నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.
దర్శిలో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వైసీపీ మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని నాదెండ్ల వెల్లడించారు. గ్రానైట్ క్వారీల్లో పర్సంటేజ్‌లు తీసుకుంటున్నారని.. బటన్ నొక్కడం వల్ల రాష్ట్రంలో ఎంతమందికి లబ్ది చేకూరిందని మనోహర్ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదని.. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అంధకారం దిశగా తీసుకెళ్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ఈసారి ఖచ్చితంగా పొత్తులతోనే .. సీఎం ఎవరవ్వాలో ఎన్నికల తర్వాత చూద్దాం : పవన్ వ్యాఖ్యలు
కాగా.. రెండ్రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో పొత్తులు వుంటాయన్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన సిద్ధంగా లేదని ఆయన పేర్కొన్నారు. తనకు ఏ పార్టీపైనా ప్రేమ , ద్వేషం లేదన్న ఆయన.. ఈసారి జనసేనకు ప్రత్యర్ధి వైసీపీయేనని స్పష్టం చేశారు. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నది తర్వాత చూద్దామని.. ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని దించడమే టార్గెట్ అని పవన్ పేర్కొన్నారు. డిసెంబర్‌లో ఎన్నికలు వస్తాయని అంటున్నారని.. జూన్‌లో తాను ప్రచారం మొదలుపెడతానని పవన్ తెలిపారు.
బలమున్న స్థానాల్లో ఎన్నికలకు వెళదామని.. మనకు వచ్చే స్థానాలను బట్టే సీఎం పదవి గురించి అడగటానికి వీలుంటుందన్నారు. పొత్తులు పెట్టుకోవడం వల్ల పార్టీ ఎదుగుతుందని.. 6 నుంచి 7 స్థానాలు గెలుస్తూ వచ్చిన బీఆర్ఎస్ నేడు జాతీయ పార్టీగా ఎదిగిందన్నారు. కాపులను వైసీపీ నాయకులు తిట్టినప్పుడు, రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పినప్పుడు.. 60 శాతం మంది కాపులు జగన్‌కు ఓటు ఎందుకు వేశారని పవన్ ప్రశ్నించారు. ఏపీకి కావాల్సింది మంచి నాయకులు కాదని.. జనంలోనే పరివర్తన రావాలని ఆయన సూచించారు.
చంద్రబాబు నాయుడు తనను మోసం చేస్తారని అంటున్నారని.. తానేమైనా చిన్నపిల్లాడినా మోసపోవడానికి అని పవన్ ప్రశ్నించారు. తనకు వయసు పెరిగిందని, గడ్డం నెరిసిందని .. ఏం తెలియకుండానే పార్టీలు పెట్టేసి, రాజకీయాల్లోకి వచ్చేస్తానా ఆయన ప్రశ్నించారు. సినిమాలు చేసుకుంటే రోజుకు రెండు కోట్లు సంపాదిస్తానని కానీ అన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు