4 పల్లెల్ని కలిపి అమరావతన్నాడు.. అక్కడంతా రియల్ ఎస్టేటే : చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్

By Siva KodatiFirst Published Dec 18, 2022, 2:29 PM IST
Highlights

చంద్రబాబు రాజకీయ జీవితం కుట్రతోనే ప్రారంభమైందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 14 ఏళ్లు సీఎంగా వున్న చంద్రబాబు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని మంత్రి ప్రశ్నించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆదివారం శ్రీసత్యసాయి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుట్రలపై తాము పోరాడుతున్నామన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమే కుట్రతో ప్రారంభమైందని ఆయన ఆరోపించారు. ఆంధ్ర, రాయలసీమల్లో ఒక్క ప్రాంతాన్ని కూడా చంద్రబాబు అభివృద్ధి చేయలేదని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా వున్న చంద్రబాబు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని మంత్రి ప్రశ్నించారు. 4 పల్లెల్ని కలిపి అమరావతి అని పేరు పెట్టి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. 

ఇదిలావుండగా... ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్‌పై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతల మధ్య విబేధాలను గమనించి వైసీపీ అధిష్టానం.. వాటికి చెక్ పెట్టేందుకు పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్,  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దించింది. అయితే పలుచోట్ల మంత్రి సమక్షంలోనే పార్టీ నాయకుల మధ్య వర్గవిబేధాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ తగిలింది. 

Also Read: పెనుగొండ వైసీపీలో వర్గ పోరు.. మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ.. కాన్వాయ్‌ వైపు చెప్పు విసిరిన కార్యకర్త..

మంత్రి పెద్దిరెడ్డి పర్యటన వేళ పెనుగొండ వైసీపీలోని ఇరువర్గాల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గం, ఆయన వ్యతిరేక వర్గం పోటాపోటీగా  మంత్రి పెద్దిరెడ్డికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. ఎమ్మెల్యే శంకర్ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసమ్మతి వర్గం రోడ్డుపై బైఠాయించింది. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో మంత్రి పెద్దిరెడ్డి వారికి సర్దిచెప్పేందుకు కిందకు దిగారు. 

అయితే మంత్రి వారితో మాట్లాడుతున్న సమయంలో ఓ కార్యకర్త.. మంత్రి కాన్వాయ్‌ వైపు చెప్పు విసిరారు. అయితే అది మంత్రికి దూరంగా పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు కార్యకర్తలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇక, ఈ పరిణామాలపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ నారాయణ వ్యతిరేక వర్గం నిరసన మధ్యనే పెద్దిరెడ్డి విస్తృత స్థాయి సమావేశానికి బయలుదేరారు.
 

click me!