బీజేపీతో జగన్ లాలూచీ పొత్తు: మంత్రి కాలువ శ్రీనివాసులు

By Nagaraju TFirst Published Sep 22, 2018, 6:19 PM IST
Highlights

2019 ఎన్నికల్లో బీజేపీతో కలసి వైసీపీ పోటీ చేస్తుందని రాష్ట్ర మంత్రి కాలవ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. వైసీపీతో పొత్తుపై సంకేతాన్ని బీజేపీ రాష్ట్ర విభాగం స్పష్టం చేసిందని తెలిపారు. వైసీపీ, బీజేపీల మధ్య బహిరంగ పొత్తు లేకపోయినా లాలూచీ పొత్తు అయినా ఉంటుందన్నారు

అనంతపురం: 2019 ఎన్నికల్లో బీజేపీతో కలసి వైసీపీ పోటీ చేస్తుందని రాష్ట్ర మంత్రి కాలవ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. వైసీపీతో పొత్తుపై సంకేతాన్ని బీజేపీ రాష్ట్ర విభాగం స్పష్టం చేసిందని తెలిపారు. వైసీపీ, బీజేపీల మధ్య బహిరంగ పొత్తు లేకపోయినా లాలూచీ పొత్తు అయినా ఉంటుందన్నారు. వైసీపీ, బీజేపీలు తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
 
నిత్యం సీఎం చంద్రబాబు ఆయన కుటుంబం మీద దుమ్మెత్తిపోయడమే బీజేపీ,వైసీపీలు ఎజెండాగా పెట్టుకున్నాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అవినీతి  ఆటలు సాగవనే ఆలోచనతో ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనించాలని కోరారు. 

పెట్రోల్‌ ధరలు ఆకాశాన్నంటుతుంటే పార్టీలు, రాజకీయాలకు సంబంధం లేకుండా యూనియన్లు, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారన్నారు. అయితే ప్రతిపక్ష నేత జగన్ కనీసం స్పందించలేదన్నారు. ప్రధాని మోదీని పల్లెత్తు మాట కూడా అనలేని నిస్సహాయ స్థితిలో జగన్ ఉన్నాడని విమర్శించారు. ఇంతకంటే దయనీయ పరిస్థితి ఏ పార్టీకి రాకూడదన్నారు. 

ప్రజల గొంతుకగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ కనీసం నిరసన తెలిపే అసహాయ స్థితిలో ఉందని మండిపడ్డారు. అలాంటి పార్టీ రాష్ట్రంలో మనుగడ సాగించడానికి అర్హత లేదన్నారు. బీజేపీకి రహస్యమిత్రుడిగా జగన్‌ ఉంటున్నారని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. 

అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నముద్దాయిలు జగన్‌, విజయసాయిరెడ్డిలకు ప్రధాని రెడ్‌కార్పెట్‌ పరచి గంటల తరబడి చర్చిస్తున్నారంటే రాష్ట్రానికి ఎలాంటి సంకేతాలిస్తున్నారో గమనించాలని కోరారు. 

రాష్ట్రంలో వైసీపీ, బీజేపీలు కలసి పనిచేస్తున్నాయని దీనిని ప్రజలు గమనించాలన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని రాష్ట్రంలో ఏ దుష్టశక్తి ఆపలేవని మంత్రి కాలవ ధీమా వ్యక్తం చేశారు. 

click me!