
‘ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం’..ఇది మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పిన మాటలు. మంత్రి భలే జోక్ వేసారుకదా? విశాఖపట్నంలో సోమవారం డిఈవోలు తదితరులతో మంత్రి సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసినా, ఫిట్ నెస్ లేని బస్సులను నడిపినా కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు లేండి. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలే చేయకూడదట, ఫిట్ నెస్ లేని బస్సులు నడపకూడదట. నిబంధనల ప్రకారమే పాఠశాలలు నడపాలంటే ఇక యాజమాన్యాలు బ్రతికేదెట్లా?
ఈ విషయాలు తెలిసే మంత్రి హెచ్చరికలు జారీ చేసారా అనుమానం వస్తొంది? నిబంధనలన్నవి ఎప్పటి నుండో ఉన్నాయి. ఏ ప్రైవేటు స్కూలైనా నిబంధనను పాటిస్తున్నదా? స్కూళ్ళు నడుపుతున్న బస్సుల్లో ఎన్నింటికి ఫిట్ నెస్ ఉంటోంది. వేరే స్కూలెందుకు? స్వయానా మంత్రిగారి వియ్యంకుడు నడుపుతున్న కార్పొరేట్ స్కూళ్ళల్లో నిబంధనలు పాటిస్తున్నవి ఎన్ని? అంతమాత్రం మంత్రిగారికి తెలీదా? ఇంకెందుకు ఈ ఉడుత బెదిరింపులు? స్కూళ్ళల్లో విద్యార్ధులు చేరాక పుస్తకాలు, యూనిఫారాలు, కేపిటేషన్ ఫీజులు పేరుతో ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటారట.
అనుమతి లేని స్కూళ్ళ జాబితా విడుదల చేసి వాటిని మూసేస్తారట. కొత్తగా మూసేసేదేముంది? ఇప్పటికే వేల స్కూళ్లు మూసేసారు. కొత్తగా 1831 స్కూళ్ళను మూసేస్తున్నట్లు స్వయంగా గంటానే చెప్పారు. ప్రభుత్వ స్కూళ్ళను మూసేస్తున్నది కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు కోసమే అంటూ ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీరు, అదనపు గదులు, బెంచీలు, ప్రహరీల వంటి మౌళిక సదుపాయాలకు రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు చంద్రబాబునాయుడు అంగీకరించారట. ఒకవైపు వేలాది స్కూళ్లను మూసేస్తున్నారు. ఇంకో వైపేమో స్కూళ్ళకు వేల కోట్ల రాపాయలు ఖర్చు పెడతామని అంటున్నారు. స్కూళ్ళను మూసేయటం మాత్రం నిజం. మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టటం సంగతేమిటి?