
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల్లోని ఆశావహులు ముందుగానే తమకు నచ్చిన నియోజకవర్గాలపై కర్చీఫ్ వేసుకుని కూర్చొన్నారు. అంతేకాదు.. తమ బెర్త్ జోలికి వస్తే ఎవరిని సహించేది లేదని తేల్చిచెబుతున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీ ఏదైనా ఇదే పరిస్ధితి నెలకొంది. అధికార వైసీపీలో ఈసారి చాలా సిట్టింగ్‌లకు టికెట్ ఇచ్చేది లేదని జగన్ ఇప్పటికే సంకేతాలు పంపారు. పనితీరు మెరుగుపరచుకోవాలని.. లేని పక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుందని హెచ్చిరించారు. వైనాట్ 175 అని జగన్ చెబుతున్నా.. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యత లేదు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో అసమ్మతి నెలకొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రామచంద్రాపురం నియోజకవర్గంలొ అసమ్మతి లేదని తెలిపారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనకు రాజకీయ గురువని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను రామచంద్రాపురం నుంచే పోటీ చేస్తానని.. ఈ విషయం ముఖ్యమంత్రి కూడా చెప్పారని వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. పేదరికమే బీసీల పాలిట రోగమని.. దీని వల్ల మూడు తరాలు కష్టాలను ఎదుర్కొన్నాయని మంత్రి వెల్లడించారు. బీసీల పరిస్ధితిపై సమగ్ర సర్వే నిర్వహించేందుకు గాను ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశామని చెల్లుబోయిన తెలిపారు.
Also Read: అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి
కాగా.. గత కొంతకాలంగా వైఎస్ఆర్‌సీపీ నాయకత్వంపై పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ పలు దఫాలు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాల్ కు వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు దక్కింది. మండపేట నుండి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు దక్కింది.
మండపేటలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు చేతిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓటమి పాలయ్యారు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఆ పార్టీ నాయకత్వం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే పార్టీ అవసరాల రీత్యా పిల్లి సుభాష్ చంద్రబోస్ ను మంత్రి వర్గం నుండి తప్పించారు జగన్. ఆయనను రాజ్యసభకు పంపారు. ఇదే జిల్లా నుండి చెల్లుబోయిన వేణుగోపాల్ ను జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
2024 ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి తన కొడుకు పిల్లి సూర్యప్రకాష్ కు టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరు కాలేదు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి మంత్రి చెల్లుబోయిన వేణు పోటీ చేయనున్నారని మిథున్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్ గా వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి తన కొడుకును బరిలోకి దింపాలని భావిస్తున్నారని ప్రచారం.