
విశాఖ పరిపాలన రాజధాని కావాలనే ఆకాంక్షను ప్రజలు బలంగా వ్యక్తం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు పరిపాలన రాజధాని రాకుండా టీడీపీ, జనసేన కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఉత్తరాంధ్రపై ఆ పార్టీలకు ఎందుకంతా ద్వేషం అని ప్రశ్నించారు. ఆ పార్టీల వైఖరి చూస్తుంటే బాధేస్తుందని అన్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ది చెందడం ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. విశాఖకు వ్యతిరేకంగా ఆడే ఆటలు ఇక సాగవని అన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్‌ది ఓ రాజకీయ పార్టీనేనా? అని విమర్శించారు. జనసేనకు విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌కు హుందాతనం లేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీ నేతలను చొక్కా పట్టుకుని అడగాలని ప్రశ్నించారు. విశాఖ రాజధాని అయితే టీడీపీ, జనసేనలకు వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అభివృద్ది చెందడం సహించలేకపోతున్నారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అమరావతి ఒక్కటే అభివృద్ది చెందాలా అని ప్రశ్నించారు. రాష్ట్ర సంపద తీసుకెళ్లి 29 గ్రామాల్లో పోయాలా? అని ప్రశ్నించారు. 29 గ్రామాలకు సరైన కనెక్టివిటీ లేదని అన్నారు. రైల్వే స్టేషన్ చూస్తే 10 కి.మీ, ఎయిర్‌పోర్టు చూస్తే 20 కి.మీ, సముద్ర తీరం చూస్తే 100 కి.మీ దూరంలో ఉన్నాయని అన్నారు. కొద్దిపాటి పెట్టుబడి పెడితే విశాఖ అద్భుతమైన నగరం అవుతుందన్నారు.
టీడీపీ అమరావతి రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రైతులు ఏం త్యాగం చేశారని ప్రశ్నించారు. త్యాగం అనే పదం చులకన అయిపోందని అన్నారు. అమరావతి పేరుతో పాదయాత్ర.. భూముల రేట్లు పెంచుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి, రాష్ట్ర ఖాజానాను దోచుకోవడానికేనని ఆరోపించారు. వాళ్లకు చట్టాలు, రాజ్యాంగం ఉంటాయని.. తమకు మాత్రం ఉండవా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు హక్కులు లేవా?.. ఇంకా థర్డ్ క్లాస్ సిటిజన్స్‌గా బతకాలా? అని అనన్నారు. విశాఖపట్నంకు వచ్చి తమని తిడితే.. తాము చూస్తూ కూర్చొవాలా? అని ప్రశ్నించారు. తాము మంచివాళ్లం, చట్టప్రకారం నడుచుకునే వ్యక్తులం కాబట్టి ఓపికతో ఉన్నామని చెప్పారు.
మూడు రాజధానులు వద్దంటూ సమావేశం పెట్టడానికి టీడీపీకి సిగ్గుండాలని అన్నారు. రాజకీయాలకు కూడా సమయం, సందర్భం ఉంటాయని చెప్పారు. విశాఖ పరిపాలన రాజధానిపై ఇప్పటికైనా ఆ పార్టీలు ఆలోచన చేయాలని కోరుతున్నట్టుగా చెప్పారు. వీలైనంత తొందరగా సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన సాగించాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. కోర్టుల్లో కేసులు వేసి ఉత్తరాంధ్ర అభివృద్ది అడ్డుకుంది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని తామేందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు. విశాఖను పరిపాలన రాజధానిగా వ్యతిరేకించే వాళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. గతంలో సాంకేతికపరమైన అంశాలు ఉన్నాయని.. సీఆర్‌డీఏ బిల్లును మాత్రమే వెనక్కి తీసుకొచ్చామని.. వికేంద్రీకరణ తమ పాలసీ అని చెప్పారు.