
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. శుక్రవారం శ్రీకాకుళలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడన్నది కల, ఇక మర్చిపోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం వున్నప్పుడు ఏం చేశారని బొత్స ప్రశ్నించారు. ఇది నా కార్యక్రమం.. ఇది పేటెంట్ అనేలా చెప్పగలరా అంటూ మంత్రి నిలదీశారు. అధికారంలో వున్నప్పుడు దోపిడీ చేసి.. దోచుకుతిన్నారని సత్యనారాయణ దుయ్యబట్టారు. జగన్ నిధులు మళ్లిస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలపైనా మంత్రి స్పందించారు. ప్రజల కోసం ఒక పథకం నిదులు మరో పథకానికి మళ్లిస్తామని.. అందులో మరో ఉద్దేశం లేదని సత్యనారాయణ స్పష్టం చేశారు.
అంతకుముందు ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీపై చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కౌంటరిచ్చారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెమ్యూనరేషన్‌ను బట్టి పవన్ కల్యాణ్ డైలాగులు, కాల్షీట్లు వుంటాయన్నారు. డబ్బులు సంపాదించేందుకే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని.. ఇప్పుడు హాలీడే టూర్ చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్ర అంశాలపై ఎలాంటి అవగాహన లేకుండానే పవన్ అహంకారంతో మాట్లాడుతున్నారని వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు.
చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకే ప్రజల్లోకి వచ్చి స్క్రిప్ట్ చదువుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ తన ఫామ్‌హౌస్‌లో వుంటే సచివాలయ వ్యవస్థ గురించి ఎలా తెలుస్తుందని చెల్లుబోయిన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు నిలకడ, ఓపిక లేవని.. పిచ్చి మాటలతో ప్రజల నమ్మకం పోయేలా నడుచుకోవద్దన్నారు. అబద్ధానికి ఆసరాగా నిలిచారంటూ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దుయ్యబట్టారు.
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. బూతులు మాట్లాడే పవన్ కళ్యాణ్ కు సంస్కారం గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. పీఆర్‌పీలో ఉన్న సమయంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడారన్నారు. పంచెలూడదీసి కొడతానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అంబటి గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని... అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని ప్రజలు అనుకున్నారని దుయ్యబట్టారు.