
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయ యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన ప్రసంగించారు. జగ్గూభాయ్ అంటున్నానని వైసీపీ వాళ్లు బాధపడుతున్నారని.. మరి నన్ను ఏదైనా అనొచ్చా, నేను అనకూడదా అని ఆయన ప్రశ్నించారు. శివశివాని స్కూళ్లో పేపర్లు ఎత్తుకొచ్చిన వాడికి మర్యాద ఎలా తెలుస్తోందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీటు ఇచ్చిన వ్యక్తి వెళ్లిపోయాడని కానీ సీటు దక్కని వ్యక్తి పార్టీ కోసం నిలబడ్డాడని పవన్ తెలిపారు. బరువుగా బెదురుగా బతుకుతున్న ఈ బతుకుల మధ్య డైనమైట్లు పేలాలని ఆయన వ్యాఖ్యానించారు. ధూర్తుల సామ్రాజ్యంలో ఆర్తుల హాహాకారాలు అన్నట్లుగా పరిస్ధతి వుందన్నారు. జగన్ 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కొంపలు కూల్చారని పవన్ మండిపడ్డారు. వైసీపీ కొంపలంటిస్తుంది.. జనసేన గుండెలంటిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ కారణంగా 32 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని పవన్ గుర్తుచేశారు. 60 రూపాయల మద్యాన్ని నువ్వు 160 చేశావంటూ జగన్‌పై మండిపడ్డారు. రేట్లు పెంచావు కాబట్టే మొహం చూపించాల్సి వస్తుంది కాబట్టే పరదాలు కట్టుకుని తిరుగుతున్నారంటూ సీఎంపై పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు సగటు మనిషి కష్టాలు తెలుసా అని ఆయన ప్రశ్నించారు.
మాటి మాటికి బటన్ నొక్కారంటున్నారు.. నొక్కని బటన్‌ల సంగతేంటని పవన్ కల్యాణ్ నిలదీశారు. మీ చెత్త పాలనలో చెత్తపై పన్నులు వేశారని ఆయన దుయ్యబట్టారు. తణుకులో టీడీఆర్ స్కాం చేసి రూ.309 కోట్లు దోచేశారని పవన్ ఆరోపించారు. ఇసుక అందుబాటులో లేకుండా చేశారని.. నిత్యావసర వస్తువుల ధరలను నాలుగు రెట్లు పెంచారని పవన్ మండిపడ్డారు. జగన్ పాలనపై క్రిటికల్ ఎనాలిసిస్ చేస్తామన్నారు.
మీ పరిపాలన ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదని.. ఇళ్లు కట్టిస్తామని ప్రియతమ ముఖ్యమంత్రి రూ.9,159 కోట్లు తీసుకున్నారని పవన్ ఆరోపించారు. తణుకులో డంపింగ్ యార్డ్ కట్టలేదని.. అలాంటి నువ్వు చెత్తపై పన్ను వేస్తావా అంటూ జనసేనాని ఆరోపించారు. పట్టాలు ఇవ్వకముందే ప్రతీ ఒక్కరి దగ్గర రూ.30 వేల చొప్పున వసూలు చేశారని ఆయన దుయ్యబట్టారు.
మద్ధతు ధర కావాలని అడిగినందుకు దువ్వ పోలీస్ స్టేషన్‌లో 24 మంది రైతులపై కేసులు నమోదు చేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పోలవరం పూర్తి చేయడం జగన్ వల్ల కాదన్నారు . గుణం లేని వాడే కులం గొడుగుపడతాడని జాషువా ఆనాడు చెప్పారని పవన్ గుర్తుచేశారు. తణుకులో పుట్టిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తనకు ప్రేరణ అన్నారు. తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి తనకు ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. జనసేన ఆవిర్భావ సభలో తాను చేసిన తొలి పలుకులు తిలక్ కవిత్వమేనన్నారు. రాష్ట్రంలో రాజకీయ అవినీతిని మనం ఆపాలని.. దీనిపై జనసేన పోరాట చేస్తుందని పవన్ చెప్పారు.
నీ చెత్తపాలన వచ్చాకే చెత్త పన్ను వచ్చిందని.. రుణాలు తీసుకుని బడ్జెట్ లెక్కల్లో చెప్పలేదన్నారు. గిట్టుబాటు ధర అడిగితే మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని పవన్ చెప్పారు. విపత్త నిర్వహణ నిధులు కూడా జగన్ దారి మళ్లించారని పవన్ దుయ్యబట్టారు. నిన్ను జగ్గూభాయ్ అని ఎందుకు అంటున్నానో అర్ధమైందా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రజల డబ్బును దోచేస్తున్నాడని.. జగన్ పథకాలు అన్నీ.. 70-30 పథకాలని పవన్ ఆరోపించారు .
జగన్ దోపిడీని కాగ్ సవివరంగా బయటపెట్టిందని.. తాను దోచేసిన డబ్బు గురించి ముఖ్యమంత్రి ఎప్పుడూ చెప్పరని పవన్ దుయ్యబట్టారు. ఎప్పట్నుంచో వున్న పథకాలకు నవరత్నాలు అని పేరెందుకు పెట్టావని ఆయన ప్రశ్నించారు. జగన్ కొత్త పథకాలేమీ అమలు చేయట్లేదని.. ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని చేయలేకపోయారని దుయ్యబట్టారు. జగన్ ఓ డిజిటల్ దొంగలా తయారయ్యారని.. డిజిటల్ గ్లిచ్ పేరుతో ఉద్యోగుల సొమ్ము మళ్లించారని పవన్ ఆరోపించారు.