రాజీనామా చేసి జనాల్లోకి వెళ్దాం, ఎప్పుడైనా రెడీ .. అగ్రిమెంట్ ప్రకారమే రైతులకు ఫ్లాట్లు: బొత్స వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 24, 2022, 9:17 PM IST
Highlights

మూడు రాజధానులకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసి జనాల్లోకి వెళ్లేందుకు మేం ఎప్పుడైనా సిద్ధమేనని ఆయన వెల్లడించారు. ఒప్పందం ప్రకారమే రైతులకు ఫ్లాట్లు ఇస్తామని బొత్స చెప్పారు. 

మాకు వున్న అధికారాలతోనే రాజధానులపై చట్టాలు (ap three capitals) చేశామన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) . గురువారం ఆయన మూడు రాజధానులపై మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడే వున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు (chandrababu naidu) అధికారం పోయిందన్న కడుపు మంటతో మాట్లాడుతున్నారంటూ బొత్స ఫైరయ్యారు. శాసనసభ సమావేశాలను జరగకుండా చేయడానికి టీడీపీ సభ్యులు ఆటంకాలు కలిగిస్తున్నారని.. కాగితాలు విసురుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న సహజ మరణాలను ..  కల్తీసారా మరణాల కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని బొత్స ఫైరయ్యారు. జంగారెడ్డి గూడెం వాసులకు వాస్తవాలు తెలుసునని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలు చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు జరగలేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మేం ఏ వ్యవస్థపై దాడి చేశామని నిలదీశారు. 7,300 ఎకరాలు అమ్మితే లక్ష కోట్లు వస్తాయా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అంబేద్కర్ నిర్ణయించిన రాజ్యాంగ ప్రకారం చట్టాలు ఉండాలని తాము మొదటి నుంచి చెప్తున్నామని ఆయన అన్నారు. దాన్ని అధిగమించి ఎవరూ ఏమీ చేయరని, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే నడుస్తున్నామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

Latest Videos

ఎవరి పాత్ర ఎంతవరకు అనే దానిపై సభలో చర్చించామని బొత్స చెప్పారు. అభిప్రాయ బేధం ఉంటే చంద్రబాబు శాసనసభలో మాట్లాడవచ్చని సూచించారు. అందుకు భిన్నంగా బయట కూర్చుని ఎలా మాట్లాడతారు అని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ బద్దమైనవిగానే ఉంటాయని స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల నిర్ణయం కోరుదామనుకుంటే.. తాము వద్దన్నామా? అని బొత్స ప్రశ్నించారు. ప్రజల కోసం చేసే చట్టాల్లోకి ఎవరూ జోక్యం చేసుకోకూడదని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు చెప్పినట్టుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామనే ఇప్పటికీ అంటున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

అంతకుముందు ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ (ys jagan) మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తామని.. వికేంద్రీకరణపై వెనకడుగు వేయమన్నారు. వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి.. అందరి ఆత్మ గౌరవమన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వికేంద్రీకరణే సరైన మార్గమని జగన్ స్పష్టం చేశారు. అందరికీ మంచి చేసే బాధ్యత మాపై వుందని సీఎం అన్నారు. వికేంద్రీకరణ తప్ప మరో మార్గం లేదని ఆయన పేర్కొన్నారు. చట్టసభకు సర్వాధికారాలు వున్నాయని.. రాబోయే తరాల కోసమే వికేంద్రీకరణ అని జగన్ చెప్పారు. 

click me!