
అమరావతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి వివిధ సేవలకోసం భక్తుల నుండి వసూలుచేస్తున్న సేవల ఛార్జీలను మరింతగా పెంచాలంటూ ఇటీవల టిటిడి (ttd) ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి (yv subbareddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష టిడిపి, బిజెపి, జనసేన పార్టీలతో పాటు శ్రీవారి భక్తులు కూడా టిటిడి ఛైర్మన్ తో పాటు వైసిపి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. దీంతో వెనక్కి తగ్గిన టిటిడి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రేట్లు పెంచడంలేదని ఇటీవల స్వయంగా ఛైర్మనే ప్రకటించారు.
అయితే ఇవాళ ఏపీ శాసనమండలిలో శ్రీవారి దర్శన, సేవల టిక్కెట్ ధరలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు (vellampalli srinivasrao) టికెట్ల రేట్ల పెంపు గురించి టిటిడి సమావేశంలో చర్చకు ఓ బిజెపి నాయకుడే కారణమని అన్నారు. బిజెపికి చెందిన టిటిడి మాజీ బోర్డ్ మెంబర్ శ్రీవారి సేవల రేట్లు పెంచమని లెటర్ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. హిందువులను వెంకటేశ్వర స్వామికి దూరం చేయాలనే దర్శన టికెట్లు, సేవల రేట్లు పెంచమన్నారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.
హిందువుల గురించి మాట్లాడే బిజెపి పార్టీ అదే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. గత టిడిపి ప్రభుత్వంలో బిజెపి సభ్యుడే దేవాదాయ మంత్రిగా పనిచేశారని... అంతకన్నా తమ ప్రభుత్వమే అద్భుతంగా పనిచేస్తోందన్నారు. తాము శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి మండలిలో వెల్లడించారు.
ఇటీవల శ్రీవారికి చేసే వివిధ సేవల రేట్లను భారీగా పెంచి భక్తులపై భారం పెంచాలంటూ టిటిడి బోర్డ్ సమావేశంలో ఛైర్మన్ అధికారులను ఆదేశిస్తున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఛైర్మన్, టిటిడి బోర్డు సభ్యులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో శ్రీవారి సేవల ధరల పెంపుపై ఇటీవల టిటిడి ఛైర్మన్ స్పందించారు. వచ్చే నెల ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే శ్రీవారి సేవల ధరలను పెంచే ఆలోచన టిటిడికి లేదని టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
శ్రీవారి ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన కూడా ఇప్పట్లో లేదని... ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగిందని సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. శ్రీవారి భక్తులపై భారం పెంచే ఆలోచన టిటిడికి లేదని ఛైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు.