
తెలంగాణతో జలవివాదం నేపథ్యంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జల వివాదం విషయంలో తెలంగాణలో సఖ్యత కోరుకుంటున్నామని వెల్లడించారు. అన్నదమ్ముల్లా వుండాలనేదే తమ కోరిక అని.. గొడవ పడాలన్న ఆలోచనే లేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని బొత్స మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
Also Read:యలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలనకు కేఆర్ఎంబీ: ఏపీ షరతు ఇదీ....
అమరరాజా ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన పేర్కొన్నారు. అమరరాజా ఫ్యాక్టరీ వెళ్లిపోవాలని తాము కోరుకోవడం లేదని బొత్స స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లే అమరరాజా పరిశ్రమ తరలిపోయిందనేది అవాస్తవమని.. ఆదాయం కోసమే పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు అమరరాజా ప్రయత్నిస్తోందని సత్యనారాయణ ఆరోపించారు. రాజధాని మార్పు ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. చట్టం చేసిన రోజే మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయని మంత్రి వెల్లడించారు. టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమిస్తామని స్పష్టం చేశారు.