తుక్కు తుక్కయిన సైకిల్‌ను బాబు తొక్కలేకపోతున్నారు .. టీడీపీకి ఇదే చివరి మహానాడు : అంబటి రాంబాబు

By Siva KodatiFirst Published May 28, 2023, 9:31 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీకి ఇదే చివరి మహానాడు అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్టీఆర్ బతికుంటే బాబు బతుకు బజారుపాలయ్యేదని రాంబాబు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చారా అని ఆయన నిలదీశారు.
 

ఎన్టీఆర్‌ను మార్కెటింగ్ చేసుకోవాలని చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నారని దుయ్యబట్టారు మంత్రి అంబటి రాంబాబు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణించే ముందు చంద్రబాబు నిజస్వరూపం గురించి చెప్పారని తెలిపారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు తీసుకురాలేదని సినీనటుడు ఆర్ నారాయణ మూర్తి వేదిక మీదే చంద్రబాబే నిలదీశారని అంబటి రాంబాబు గుర్తుచేశారు. కేంద్రంలో భాగస్వామిగా వున్నప్పుడు భారతరత్న కోసం ఎందుకు ప్రయత్నించలేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీకి ఇదే చివరి మహానాడు అని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ వుండదన్నారు. 

సైకిల్‌ను చంద్రబాబు, లోకేష్‌లు తొక్కలేకపోతున్నారని.. దానికి తుప్పు పట్టిందని రాంబాబు సెటైర్లు వేశారు. టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్ధితి లేదని.. ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు. ఇచ్చిన వాగ్ధానాన్ని చంద్రబాబు ఎప్పుడైనా నెరవేర్చారా అని అంబటి ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చారా అని ఆయన నిలదీశారు. ఒక్క హామీనైనా నిజాయితీగా అమలు చేశావా చంద్రబాబు అంటూ అంబటి ప్రశ్నించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దని.. ఇచ్చిన హామీలను నట్టేట ముంచిన నీచ చరిత్ర చంద్రబాబుదని రాంబాబు దుయ్యబట్టారు. 

ALso Read: జగన్‌కు పల్లకిని మోస్తున్నట్లుగా పవన్ ట్వీట్.. మేం మా నాయకుడినే మోస్తామంటూ అంబటి కౌంటర్

చంద్రబాబు జీవితమంతా ప్రజలను మోసం చేయడమేనని.. వచ్చే ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్యే యుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఒక్క పేదవాడినైనా ధనవంతుడినిన చేసిన చరిత్ర చంద్రబాబుకు వుందా అని అంబటి ప్రశ్నించారు. దోచుకు తినడమే చంద్రబాబుకు తెలుసునంటూ చురకలంటించారు. ఎన్టీఆర్ బతికుంటే బాబు బతుకు బజారుపాలయ్యేదని రాంబాబు పేర్కొన్నారు. మహానాడులో చంద్రబాబు అభూతకల్పనలు చెప్పారని.. మేం చెప్పింది చేసి చూపించామన్నారు. టీడీపీ చెప్పింది ఏది చేయలేదని.. చంద్రబాబును ప్రజలు ఎన్నటికీ నమ్మరని రాంబాబు స్పష్టం చేశారు. 

click me!