టీడీపీని దెబ్బ కొట్టాలని ఎంతోమంది ట్రై చేశారు.. రాజకీయ రౌడీలు ఖబడ్దార్ : చంద్రబాబు

By Siva KodatiFirst Published May 28, 2023, 8:10 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలని చాలా మంది ట్రై చేశారని అన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. బీసీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేశారని.. మహానాడును చెడగొట్టేందుకే ఫ్లెక్సీలు కట్టారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఎప్పుడూ ముందుంటానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆదివారం రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగిస్తూ.. మనల్ని అడ్డుకున్న వారిని తొక్కుకుంటూ వెళ్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగు జాతి చరిత్ర తిరగరాసేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టి కష్టపడి ఎదిగారని ప్రశంసించారు. తెలుగువారి రుణం తీర్చుకునేందుకే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతిని దేశ, విదేశాల్లో ఘనంగా నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. పాలనలో పేదవారి కోసం ఆలోచించారని.. మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు పేర్కొన్నారు. బడుగు , బలహీనవర్గాలను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తెచ్చారని గుర్తుచేశారు.

రాజకీయ రౌడీలు ఖబద్దార్ జాగ్రత్త అంటూ చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంకిత భావం కలిగిన కార్యకర్తలు ఉండటమే టీడీపీ బలమన్న ఆయన.. టీడీపీని దెబ్బతీద్దామని చూసి అనేకమంది విఫలమయ్యారని చంద్రబాబు గుర్తుచేశారు. రూ.2 కిలో బియ్యం పథకం తర్వాతే దేశంలో ఆహార భద్రత వచ్చిందని.. సంపద సృష్టించడం నేర్పిన పార్టీ మనదేనన్నారు. ఒకేసారి రూ.50 వేలు రైతు రుణమాఫీ చేసిన పార్టీ మాదేనన్నారు. ఉద్యోగులకు రూ.42 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని.. ఇప్పుడు సమయానికి జీతాలు ఇచ్చే పరిస్ధితి వుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి అన్నారు. 

అమరావతికి 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని.. పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరానికీ నీళ్లు ఇద్దామని చూశామన్నారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని.. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఒక్కరికీ కూడా ఉద్యోగం రాలేదన్నారు. యువతకు జాబు రావాలంటే మళ్లీ జాబు రావాలన్నారు. బీసీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేశారని.. మహానాడును చెడగొట్టేందుకే ఫ్లెక్సీలు కట్టారని ఆయన ఆరోపించారు. చిల్లర, చెత్త, పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని.. వైసీపీ పాలనలో ధరలు పెరిగి ప్రజలంతా నష్టపోయారని చంద్రబాబు దుయ్యబట్టారు. 

మద్యం ధరను పెంచి, నాసిరకం బ్రాండ్లు తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారిని ధనికులుగా చేయడం మా ఉద్దేశ్యమన్నారు. రాజకీయాలను వ్యాపారం చేసి దోచుకున్నారని.. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. అసమర్ధ, విధ్వంస పాలన వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని.. తెలంగాణ ఆదాయం పెరిగేందుకు పునాది వేసింది తానేని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక వనరులు వున్నాయని.. ఆదాయం పెంచవచ్చని ఆయన స్పష్టం చేశారు. 2019లో తాము మరోసారి అధికారంలోకి వచ్చుంటే రాష్ట్రం పరిస్థితి మరోలా వుండేదన్నారు. నాలుగేళ్లలో ఏపీ కంటే తెలంగాణ ఆదాయం బాగా పెరిగిందని చంద్రబాబు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

click me!