తెలుగు ప్రజలంటే ఎవరు.. బీజేపీలోని మీ బంధువులా, కాంగ్రెస్‌లోని మీ మనుషులా : చంద్రబాబుకు అంబటి కౌంటర్

Siva Kodati | Published : Oct 22, 2023 7:51 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి తెలుగు ప్రజలకు రాసిన లేఖకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు . తెలుగు ప్రజలంటే ఎవరు.. మీ మీడియా మిత్రులా, బీజేపీలో వున్న మీ బంధువులా, కాంగ్రెస్‌లోకి పంపించిన మీ మనుషులా అంబటి ప్రశ్నించారు.

Google News Follow Us

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి తెలుగు ప్రజలకు రాసిన లేఖకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు. ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. జైలు నుంచి ఈ ఉత్తరాన్ని ఎలా బయటకు పంపారన్న డీటెయిల్స్‌లోకి, 17 ఏ ప్రోటోకాల్స్‌లోకి నేను వెళ్లడం లేదన్నారు. న్యాయ పోరాటాన్ని ఆపేయాలని.. క్వాష్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు ఉపసంహరించుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మీ పేరు చెబితే గుర్తుకొచ్చే నాలుగు స్కీంలు ప్రజలకు తెలియజేయాలని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేరని మంత్రి దుయ్యబట్టారు. 

తెలుగు ప్రజలంటే ఎవరు.. మీ మీడియా మిత్రులా, బీజేపీలో వున్న మీ బంధువులా, కాంగ్రెస్‌లోకి పంపించిన మీ మనుషులా అంబటి ప్రశ్నించారు. మీ ఆస్తులు, మీ ఆదాయంపై పిటిషన్ వేస్తానని.. సీబీఐ విచారణకు సిద్ధమా అని చంద్రబాబుకు అంబటి సవాల్ విసిరారు. తండ్రికి వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయన పక్కన కాకుండా, భర్త పక్కన వున్న నారా భువనేశ్వరి ఎన్టీఆర్ వారసురాలు ఎలా అవుతుందని మంత్రి ప్రశ్నించారు. జగన్ మీ లాగా పొత్తులను నమ్ముకోలేదని.. తాను చేసిన అభివృద్ధిని, ప్రజలకు పంచిన డీబీటీని నమ్ముకున్నారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.  మీ దుష్ట బృందంలో అందరికీ వయసైపోయిందని.. కానీ  సమయంలోనూ నిజాన్ని ఒప్పుకునే అంతరాత్మ ఎవరికీ లేదంటూ మంత్రి చురకలంటించారు. 

Also Read: భువనేశ్వరిని ఆశీర్వదించండి ... త్వరలోనే బయటికొస్తా : తెలుగు ప్రజలకు చంద్రబాబు లేఖ

అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆదివారం జైలు నుంచి తెలుగు ప్రజలకు లేఖ రాశారు. అందరికీ దసరా శుభాకాంక్షలు రాసిన ఆయన ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుందని, త్వరలోనే బయటికొస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తాను జైలులో లేనని.. ప్రజల హృదయాల్లో వున్నానని , ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరని టీడీపీ చీఫ్ తెలిపారు. 45 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న తన విలువలు, విశ్వసనీయతను ఎవరూ చెరిపివేయలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. 

తన రాజకీయ జీవితమంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగిందని ఆయన తెలిపారు. ఓటమి భయంతో తనను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేయాలనుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను మీ మధ్య లేకపోయినా అభివృద్ధి రూపంలో ప్రతి చోటా కనిపిస్తూనే వుంటానని ఆయన పేర్కొన్నారు. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం అనే సూర్యుడి ముందు కారు మబ్బులు వీడిపోతాయని.. సంకెళ్లు తన సంకల్పాలన్ని బంధించలేవని, జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని టీడీపీ అధినేత స్పష్టం చేశారు. తను తప్పు చేయను, చేయనివ్వనని ఆయన పేర్కొన్నారు. 
 

Read more Articles on