పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తా.. ఈ పేర్లు పరిశీలిస్తున్నా: మంత్రి అంబటి

By Mahesh KFirst Published Aug 2, 2023, 12:10 AM IST
Highlights

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తానని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆ సినిమా కథం సిద్ధంగా ఉన్నదని, సినిమా పేర్లు పరిశీలిస్తామని వ్యంగ్యంగా పేర్కొన్నారు. పెళ్లి పెటాకులు, తాళి ఎగతాళి, బహుభార్యలు ప్రావీణ్యుడు వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నట్టు పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే.. మ్రో అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నామని అంబటి చెప్పారు.
 

అమరావతి: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులగా వచ్చిన బ్రో సినిమా కలెక్షన్లతోపాటు రాజకీయ దుమారాన్ని రేపింది. ముఖ్యంగా ఆ సినిమాలో యాక్టర్ పృథ్వీ పాత్ర వివాదాస్పదమైంది. మంత్రి అంబటి రాంబాబును వ్యంగ్యంగా ఆ పాత్రలో చూపించారనే వాదనలు వచ్చాయి. డ్రెస్సింగ్, డ్యాన్స్‌‌తో అంబటి రాంబాబును అనుకరించి కామెడీ చేశారని చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. 

తాను కూడా ఓ సినిమా తీస్తున్నానని మంత్రి అంబటి చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ సినిమా తీస్తానని, అందుకు కథ సిద్ధంగా ఉన్నదని, సినిమా పేర్లు పరిశీలిస్తున్నానని చెప్పారు. బ్రో సినిమా పేరును పోలిన మ్రో పేరున పరిశీలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మ్రో(MRO) అంటే మ్యారేజెస్, రిలేషన్స్, అఫెండర్స్ అని తెలిపారు.

అంతేకాదు, మ్రోతోపాటు మరికొన్ని పేర్లను ఆయన చదివి వినిపించారు. పెళ్లి పెటాకులు, తాళి ఎగతాళి, బహుభార్య ప్రావీణ్యుడు వంటి పేర్లను ఆయన చదివారు. సినిమా స్టోరీని కూడా ఆయన చెప్పారు. మంచి నేపథ్యం ఉన్న కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు జన్మిస్తారని, ఇద్దరు ప్రయోజకులవుతారని, చివరి వ్యక్తి మాత్రం ఊగిపోతూ ఉపన్యాసాలు ఇస్తారని అన్నారు. ఈ సినిమాలో ఆ వ్యక్తి పెళ్లిళ్ల గురించి చూపిస్తామని, క్లైమాక్స్‌లో మహిళలు గుణపాఠం నేర్పటాన్నీ చూపిస్తామని వివరించారు.

Also Read: మణిపూర్ హింస: ఇండియా కూటమి ఎంపీలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్.. ఉదయం 11.30 గంటలకు..!

ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌ను పరోక్షంగా ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు చేశారు. బ్రో సినిమాలో శ్యామ్ బాబు అని పేరు పెట్టిన పాత్రను పృథ్వీ పోషించారు. గతంలో అంబటి రాంబాబు ఓ వేడుకలో డ్యాన్స్ చేసినప్పుడు వేసుకున్న డ్రెస్‌ను పోలిన డ్రెస్సే వేసుకుంటాడు.. అదే మేకప్‌లోకనిపిస్తాడు. ఈ పాత్ర వివాదానికి కేంద్రమైంది. అయితే, సినిమా యూనిట్ మాత్రం ఈ ఆరోపణలు కొట్టివేసింది. ఈ పాత్ర కాకతాళియం అని, శ్యామ్ బాబు పాత్రకు, రాంబాబుతో సంబంధం లేదని స్పష్టం చేసింది.

click me!