జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్ట్ నోటీసులు.. మళ్లీ తెరపైకి ఆ కేసు

By Siva KodatiFirst Published Aug 1, 2023, 9:08 PM IST
Highlights

టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ కార్పోరేషన్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.  BS3 వాహనాలను BS4గా మార్చి నడుపుతున్నారనే అభియోగాలపై ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 

టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ కార్పోరేషన్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఆయన ఆధ్వర్యంలో నడుస్తోన్న దివాకర్ ట్రావెల్స్ BS3 వాహనాలను BS4గా మార్చి నడుపుతున్నారనే అభియోగాలపై స్పందించిన న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 2020 అక్టోబర్ 12న తెలంగాణ రవాణా శాఖకు ఈ విషయంపై తాను పలుమార్లు ఫిర్యాదు చేశానని పిటిషన్‌దారుడు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో బస్సులను అక్రమంగా నడుపుతున్నారని.. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరించడమేనని ఆయన పిటిషన్‌లో వివరించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ కమీషనర్, డీజీపీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.   

Also Read: నాపై మళ్లీ కేసులు పెట్టేందుకు యత్నం.. పోలీసులు లేకుంటే మా ఎమ్మెల్యే అడుగు ముందుకు పడదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

ఇకపోతే.. ఈ నెల ప్రారంభంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై విమర్శలు గుప్పించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తనపై మళ్లీ  కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు లేకుంటే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి తమ ఎమ్మెల్యేదని విమర్శించారు. ‘ఎమ్మెల్యే పదవి లేకుంటే అది లేదనే దిగులుతోనే నువ్వు, మీ చిన్నాన్న చనిపోతారు’’ అని పెద్దారెడ్డి, వెంకటరామిరెడ్డిలను ఉద్దేశించి కామెంట్  చేశారు. వాళ్ల మాదిరిగా  దోచుకోవడం తమకు చేతకాదని అన్నారు. కారులో కూర్చొని కారుకూతలు కూస్తున్నారని విమర్శించారు. కాఫీకి పిలిస్తే మీ ఇంటికైనా వస్తానని అన్నారు. ‘‘మీ తాత చనిపోతే పోలేకపోయారు. పోలీస్ లేకుంటే మీ చిన్నాన్న ఒక్క అడుగువేస్తాడా. మీ నాన్నను చంపిన వాళ్ళతో ఎందుకు రాజీ అయ్యారు’’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. 

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనీ మొక్కలు నాటిన ఏడాదికే రూ.13.89 లక్షల పంట నష్టం పరిహారం అందిందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో ఉన్న పెద్దారెడ్డి చీనీ తోటను పరిశీలించడానికి వెళ్తానని ప్రకటించారు. పెద్దారెడ్డి చీనీ తోటకు వస్తానని, దమ్ముంటే ఆపాలంటూ సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో పోలీసులు జేసీని గృహ నిర్బంధం చేశారు.

click me!