రాజకీయ ప్రత్యర్థి రఘువీరాతో భేటీ: జేసీ ప్రభాకర్ రెడ్డి రాయలసీమ ఉద్యమం ఎజెండా

By telugu teamFirst Published Aug 2, 2021, 8:33 AM IST
Highlights

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాయలసీమ ఉద్యమ నిర్మాణం దిశగా సాగుతున్నారు. ఇందులో భాగంగా ఆయన మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో భేటీ అయ్యారు.

అనంతపురం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాయలసీమ ఉద్యమం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. రాయలసీమ ఉద్యమాన్ని సాగిస్తానని ఆయన ఆదివారంనాడు ప్రకటించారు. తన ప్రకటనతో జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ నేతల దృష్టిని ఆకర్షించారు. 

తన రాయలసీమ ఉద్యమం కోసం సీనియర్ రాజకీయ నేతలను, ఇతర వర్గాలకు చెందిన ప్రముఖులను ఏకం చేయాలని చూస్తున్నారు. రిటైర్డ్ అధికారులను, ఇంజనీర్లను రాయలసీమ ఉద్యమ జెండా కిందికి తేవాలని చూస్తున్నారు. 

తన ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని కలిశారు. వారిద్దరి మధ్య దశాబ్ద కాలంగా రాజకీయ వైరం ఉంది. మడకశిర మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో రఘువీరా రెడ్డిని కలిసి తాను చేపట్టే ఉద్యమంలోకి రావాలని కోరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ను కూడా కలిశారు. రాయలసీమ ఉద్యమాన్ని చేపట్టబోతున్నట్లు రఘువీరా రెడ్డితో భేటీ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. రాయలసీమ జిల్లాలో తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నాయని, నదీ జలాల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు 

రాజకీయాలకు అతీతంగా తన ఉద్యమాన్ని సాగిస్తానని, భవిష్యత్తు తరాలు జలాల కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని సాగించాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. పలువురు సీనియర్ నాయకులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, కార్యకర్తలతో ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. 

జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో కాంగ్రెసులో ఉండేవారు. కాంగ్రెసు నుంచి తప్పుకుని ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోగా, తాడిపత్రిలో మాత్రమే జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీని గెలిపించారు. కాగా, ఇప్పటికే సీనియర్ నేత ఎంవీ మైసురా రెడ్డి గ్రేటర్ రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు ఎజెండాను ఎత్తుకున్నారు. నదీ జలాల అంశాన్ని ప్రధానం చేసుకుని ఆయన ముందుకు సాగుతున్నారు. 

click me!