
మంగళగిరి: భర్త ఇంట్లోలేని సమయంలో వివాహిత అదృశ్యమైన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. వివాహిత ఆఛూకీ కోసం కుటుంబసభ్యులతో పాటు పోలీసులు కూడా నిన్నటి(బుధవారం) నుండి గాలిస్తున్నప్పటికి ఇప్పటివరకు లభించలేదు.
పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళగిరి మండల పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో భార్యాభర్తలు నివాసముండేవారు. భర్త ఉద్యోగం చేస్తుండగా భార్య ఇంటివద్దే వుండేది. అయితే ప్రతిరోజూ మాదిరిగానే బుధవారం కూడా భర్త ఆఫీస్ కు వెళ్లగా ఇంట్లో వివాహిత ఒంటరిగా వుంది.
ఏమయ్యిందో తెలీదుగానీ భర్త డ్యూటీ ముగించుకుని సాయంత్రం ఇంటికివచ్చేసరికి భార్య కనిపించలేదు. ఇంటిచుట్టుపక్కల వెతికినా లాభంలేకపోవడంతో కంగారుపడిపోయిన అతడు కుటుంబసభ్యులకు, బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఎక్కడా ఆమె ఆఛూకీ లభించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసుకున్న మంగళగిరి పోలీసులు కూడా వివాహిత ఆఛూకీ కోసం గాలిస్తున్నారు. ఆమెను ఎవరైనా బలవంతంగా ఎత్తుకుపోయారా లేక ఆమే ఇష్టపూర్వకంగా ఎక్కడికైనా వెళ్లిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాలు, ఫోన్ ట్రాకింగ్ ద్వారా యువతి ఆఛూకీ కనుగొనెందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలావుంటే తెలంగాణలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కిష్టయ్యగూడెంకు చెందిన ఆంజనేయులు, నందిని భార్యాభర్తలు. వీరికి ఓ బాబు సంతానం. ఇద్దరు భార్యాభర్తలు పట్టణ పరిధిలోని భవాని నగర్ లో నివాసం ఉంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఏమయ్యిందో తెలీదు గాానీ కన్నబిడ్డను ఒంటరిగా వదిలి తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది.
గత నెల(మార్చి)లో ఆంజనేయులు పని నిమిత్తం హైదరాబాద్ కి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఏడాదిన్నర బాబు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. నందిని ఇంట్లో కనిపించలేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, బంధువులు, తెలిసినవారిని విచారించి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆమో ఆఛూకీ లభించలేదు.