ఫోరస్ ఫ్యాక్టరీ ప్రమాదంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ఆధారంగా ఈ ఫ్యాక్టరీ భవితవ్యం ఆధారపడి ఉంటుందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో గురువారం నాడు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఆరుగురు మరణించారు.
ఏలూరు: Fores ఫ్యాక్టరీపై పొల్యూషన్ కంట్రోలల్ బోర్డు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని Eluru ఎంపీ కోటగిరి శ్రీధర్ చెప్పారు. ఫోరస్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే.
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఏలూరు ఎంపీ Kotagiri Sridhar గురువారం నాడు ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ఫ్యాక్టరీ ఇక్కడ లేకున్నా నష్టమేం లేదన్నారు. ఫోరస్ ఫ్యాక్టరీపై ఇప్పటిరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఎయిర్, వాటర్, గ్రౌండ్ పొలూష్యన్ ఏమైనా ఉందా అని Pollution Control Board పరిశీలిస్తుందన్నారు. పీసీబీ రిపోర్టు ఆధారంగా ఫ్యాక్టరీ భవితవ్యం ఆధారపడి ఉంటుందని ఎంపీ శ్రీధర్ చెప్పారు.
ప.గో కలెక్టర్ కు సీఎస్ సమీర్ శర్మ ఫోన్
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Sameer Sharma గురువారం నాడు ఉదయం ఫోన్ చేశారు. పోరస్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ఆరా తీశారు. అంతేకాదు ఈ ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేసి నివేదికను ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు.
ఇదిలా ఉంటే ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో స్థానికంగా కాలుష్యం పెరిగిపోతుందని ఐదు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఫ్యాక్టరీ ఎదుట స్థానికులు ఆందోళన చేశారు. ఆందోళనకారులకు పోలీసులు, ప్రజా ప్రతినిధులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఫ్యాక్టరీని శాశ్వాతంగా మూసివేస్తామని హామీ ఇవ్వాలని ఆందోళన కారులు పట్టుబడ్డారు.. గతంలో కూడా ఈ ఫ్యాక్టరీలో ఇదే తరహలో ప్రమాదాలు జరిగాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. పదే పదే ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.
ఈ ఫ్యాక్టరీలోని నాలుగవ యూనిట్ లో Gas leak రియాక్టర్ పేలిందని ప్రాథమికంగా గుర్తించారు. ఘటన స్థలంలోనే ఐదుగురు మరణించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 13 మంది కార్మికులున్నారు. ఈ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్లను రంగంలోకి దించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తొలుత నూజివీడు ఆసుపత్రికి అక్కడి నుండి Vijayawada జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 12 మందికి 80 శాతం పైగా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. బాధితుల పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు.
ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలను ప్రకటించారు సీఎం వైఎస్ జగన్. ప్రభుత్వం ప్రకటించిన పరిహారంతో పాటు ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా పరిహరం చెల్లించేందుకు అంగీకరించింది.