ప.గోదావరి లో ప్రమాదం: ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేత

By narsimha lode  |  First Published Apr 14, 2022, 10:01 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం వద్ద ఉన్న ఫోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసివేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇవాళ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


ఏలూరు: West Godavari జిల్లాలోని  ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం వద్ద ఉన్న ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు.  గురువారం నాడు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్  ప్రసన్న వెంకటేష్, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, నూజీవీడు ఎమ్మెల్యే వెంకట అప్పారావు తదితరులు సందర్శించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు.  ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికులు ఆందోళన చేస్తున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు గుర్తు చేశారు. అయితే తాత్కాలికంగా Fores Chemical Factory ని మూసివేస్తునట్టుగా కలెక్టర్  ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఫ్యాక్టరీలో ప్రమాదానికి గల కారణాలను అధికారు బృందం దర్యాప్తు చేస్తుందన్నారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నంత కాలం కంపెనీ వేతనం చెల్లించనుందని  కలెక్టర్ తెలిపారు.  కంపెనీలోని రియాక్టర్ లో హై ప్రెషర్  వల్లే ప్రమాదం జరిగిందని  తేలిందని కలెక్టర్ వివరించారు. ఈ ప్రమాదంపై విచారణ చేస్తున్నామన్నారు.  ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నలుగురు Bihar  రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారని Collector చెప్పారు.

Latest Videos

అంతకు ముందు MLA  వెంకట అప్పారావు మీడియాతో మాట్లాడారు ఈ ప్రమాదంలో మరణించిన కార్మికులకు ప్రభుత్వం తరపున రూ. 25 లక్షలు, ఫ్యాక్టరీ యాజమాన్యం మరో రూ. 25 లక్షలు చెల్లించనున్నాయన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు చికిత్స అందిస్తున్నామన్నారు. కార్మికులకు నయమయ్యే వరకు  వారికి అవసరమైన సహాయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో విష వాయువు  లీకైంది. ఈ ఘటన 2020 మే 7వ తేదీన చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఫ్యాక్టరీల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే  రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై  సరైన చర్యలు తీసుకోని కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకొంటున్నాయని అక్కిరెడ్డిగూడెం వాసులు ఆందోళన చేస్తున్నారు.

ఎల్జీ ఫ్యాక్టరీ ప్రమాదంపై  హైకోర్టు కీలకమైన తీర్పును ఇచ్చింది. ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలోని యంత్రాలను, ఉత్పత్తులను విక్రయించి ఆ ఆదాయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని కూడా హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో ఎల్జీ పాలీమర్స్ యాజమాన్యం  సవాల్ చేసింది. బాధిత కుటుంబాలకు  కోటి రూపాయాలను అందించారు.  ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ., 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ఏడాది దాటినా కూడా రూ. 10 వేల పరిహారం అందలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో స్థానికంగా కాలుష్యం పెరిగిపోతుందని  ఐదు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఫ్యాక్టరీ ఎదుట స్థానికులు ఆందోళన చేశారు. ఆందోళనకారులకు పోలీసులు, ప్రజా ప్రతినిధులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే  ఈ ఫ్యాక్టరీని శాశ్వాతంగా మూసివేస్తామని హామీ ఇవ్వాలని ఆందోళన కారులు పట్టుబడ్డారు. 
 

click me!