
వచ్చే నెల 3వ తేదీన ఐదు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో పోయిన సోమవారం జరిగిన కాల్పుల్లో 25 మంది మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే. పోలీసులు ఏకపక్షంగా తమపై కాల్పులు జరిపినట్లు మావోయిస్టు కేంద్ర కమిటి శనివారం ప్రకటించింది.
ఎన్ కౌంటర్ జరిగిన ఐదు రోజుల తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటి అధికారికంగా స్పందిచటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, ఒడిస్సా రాష్ట్రాల్లో బంద్ విజయవంతం చేయాలంటూ ప్రజలను కమిటి కోరింది.
ఇదే విషయమై కేంద్ర కమిటి అధికార ప్రతినిధి ప్రతాప్ మాట్లాడుతూ, గడచిన 40 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్ కౌంటర్ లో పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లు అంగీకరించారు. జరిగిన ఎదురు కాల్పుల్లో ఛత్తీస్ ఘర్, ఒడిస్సాలకు చెందిన మావోయిస్టులుండటంతో పాటు కాల్పుల్లో గాయపడిన మరో 11 మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు చెప్పారు. కోవర్ట్ ఆపరేషన్ వల్లే పోలీసులు కాల్పులు జరపగలిగినట్లు ప్రతాప్ పేర్కొన్నారు.
ఇటువంటి కోవర్ట్ ఆపరేషన్లు ఎన్ని జరిగినా మావోయిస్టులు భయపడేదిలేదని కూడా స్పష్టం చేసారు. అయితే, జరిగినదానికి ప్రభుత్వ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా హెచ్చరించారు. బాక్సైట్ గనుల కోసమే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, ఒడిస్సా సిఎం నవీన్ పట్నాయక్ ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపించారు.