పార్టీ నుండి మన్నార్ గుడి మాఫియా వెలి

First Published Apr 19, 2017, 4:16 AM IST
Highlights

శశికళతో పాటు దినకరన్ తదితర కుటుంబసభ్యులందరినీ పార్టీ నుండి వెలేసారంటేనే వారిపై పార్టీలో ఎంతటి వ్యతిరేకత ఉందో అర్ధమవుతోంది. కాకపోతే ఇంతకాలం విధేయత అన్నముసుగు వేసుకున్నారంతే.

మొత్తానికి మన్నార్ గుడి మాఫియాను ఏఐఏడిఎంకె పార్టీ నుండి వెలివేసారు. బ్రతికున్నపుడు జయలలిత కూడా ఈ పని చేయలేదు. అప్పట్లో శశికళను పార్టీ నుండి సస్పెండ్ చేయటంతో పాటు కుటుంబాన్ని జయ దూరంగా పెట్టింది. కానీ ఇపుడు ఏకంగా పార్టీ నుండి వేలేసేసారు. దాంతో దశాబ్దాల పాటు ఏఐఏడిఎంకెపై శశికళ పెత్తనానికి తెరపడినట్లే. నిర్ణయాన్ని ప్రకటించేముందు పార్టీలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శశికళతో పాటు దినకరన్ తదితర కుటుంబసభ్యులందరినీ పార్టీ నుండి వెలేసారంటేనే వారిపై పార్టీలో ఎంతటి వ్యతిరేకత ఉందో అర్ధమవుతోంది. కాకపోతే ఇంతకాలం విధేయత అన్నముసుగు వేసుకున్నారంతే.

ఎప్పుడైతే పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును సాధించుకోవటానికి మొన్నటి వరకూ పార్టీ డిప్యుటి జనరల్ సెక్రెటరీగా ఉన్న టిటివి దినకరన్ మధ్యవర్తిని కుదుర్చుకున్నారన్న విషయం వెలుగు చూసిందో దినకరన్ చుట్టు ఉచ్చు బిగిసిందన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. ఎన్నికల కమీషన్ కే లంచం ఇవ్వటం ద్వారా ఎన్నికల గుర్తును సొంతం చేసుకోవటానికి రూ. 60 కోట్లతో డీల్ కుదుర్చుకున్నారన్న విషయం పోలీసుల విచారణలో బయటపడింది. దాంతో దినకరన్ పై కేసు నమోదవ్వటమే కాకుండా అరెస్టుకు రంగం సిద్ధమైపోయింది.

ఎటూ శశికళ జైలులోనే ఉన్నారు. ఇపుడు దినకరన్ కూడా జైలుకు వెళుతున్నారు. దాంతో కుటుంబం వల్ల పార్టీ పరువు రోడ్డునపడిందంటూ పార్టీ నేతలు మండిపడ్డారు. అందులో నుండే సిఎం పళనిస్వామి, మాజీ సిఎం పన్నీర్ సెల్వం వర్గాలు ఏకమైతే బాగుంటుందని కొందరు చేసిన ప్రతిపాదనకు అందరూ ఆమొదం తెలిపారు. దాంతో పళనిస్వామి ముఖ్యమంత్రిగానే కొనసాగేట్లు, పన్నీర్ కు పార్టీసారధ్య బాధ్యతలతో పాటు మళ్ళీ రెవిన్యూశాఖ అప్పగించేట్లు నిర్ణయమైందని ప్రచారం.

ఒకవేళ రెండు వర్గాలు గనుక ఏకమైతే ఎన్నికల కమీషన్ ముందున్న పిటీషన్లను ఉపసంహరించుకుంటాయి. దాంతో రెండాకుల గుర్తు మళ్ళీ పార్టీకే దక్కుతుంది. అలాగే ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేస్తారో చూడాలి. కాకపోతే జయలలిత మరణంపై గతంలో పన్నీర్ సెల్వం వేసిన కమీషన్ కొనసాగుతుందో లేదో చూడాలి. జయ మరణానికి శశికళే కారణమని తేల్చాలని  పార్టీ అనుకుంటే మాత్రం విచారణ స్పీడందుకుంటుందనటంలో సందేహం అవసరం లేదు.

click me!