
ముంపు మండలాల కోసం పట్టుబట్టినట్లుగానే ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ముఖ్యమంత్రిగా కొనసాగలేనని కేంద్రప్రభుత్వాన్ని బెదిరించాలంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సూచించారు. ఈనెల 23న నీతిఅయోగ్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ అభివృద్ధి మండలి సమావేశం జరుగబోతోంది. అందులో పాల్గొంటున్న సిఎంకు హోదా సాధన విషయంలో కెవిపి కొన్ని సూచనలు చేసారు బహిరంగ లేఖలో. నేరుగా ప్రత్యేకహోదా కావాలని కేంద్రాన్నిఅడిగే ధైర్యంలేకపోతే ప్రత్యేకహోదా కోసం ప్రజల నుండి ఒత్తిడి వస్తున్నట్లు చెప్పాలని తెలిపారు. హోదా ఇవ్వకపోతే ప్రజలకు మొహం చూపించలేమని ఎన్నికల భాషలో కేంద్రానికి నచ్చచెబుతారో లేకపోతే బ్రతిమాడుకుంటారో మీ ఇష్టమంటూ కెవిపి చెప్పటం గమనార్హం.
మొత్తానికి ఏదో విధంగా హోదా సాధించి రాష్ట్రాభివృద్ధికి పాటు పడాలంటూ కెవిపి సిఎంకు చెప్పారు. ఒకవేళ హోదా అంశాన్ని ఈనెల 23వ తేదీన జరిగే జాతీయ అభివృద్ధి మండలి(ఎన్డిసి) సమావేశంలో లేవనెత్తలేకపోతే రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వారిగా మిగిలిపోతారంటూ కెవిపి తీవ్రంగా హెచ్చరించారు. కాబట్టి మనస్సాక్షిని మేల్కొలపాలని కూడా హితవుపలికారు. పోయిన ఎన్నికల సమయంలో హోదా కోసం పోటీలు పడి భాజపా, టిడిపిలు ప్రజలకు చేసిన వాగ్దాలను ఒకసారి గుర్తుకుతెచ్చుకోమని కోరారు. ప్రత్యేకహొదా ఇచ్చే విషయం మొదటినుండి కేంద్రం రాష్ట్రం పట్ల వివక్షాపూరితంగా ఎందుకు వ్యవహరిస్తోందనే విషయం ప్రజలకు అర్ధం కావట్లేదన్నారు.
హోదా విషయంలో మొదటి నుండి కేంద్రం చెబుతున్నవన్నీ కేవలం కథలేనని కెవిపి తేల్చేసారు. ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రాలు ప్రతీ అంశంలోనూ బాగా లబ్దిపొందిన విషయాన్ని లేఖలో కెవిపి పేర్కొన్నారు. నీతి అయోగ్ గౌర్నింగ్ కౌన్సల్ ఏర్పడిన 26 మాసాల తర్వాత రెండోసారి సమావేశం అవుతోందని కూడా చెప్పారు. అంటే సాధారణ ఎన్నికలలోపు మళ్ళీ సమావేశమవుతుందన్న నమ్మకం కూడా లేదన్నారు.
వ్యక్తిగత ఇబ్బందులతోనే కేంద్రాన్ని హోదా కోసం చంద్రబాబు పట్టుబట్టలేకున్నారని ప్రజల్లో ప్రచారం జరుగుతోందని కూడా కెవిపి అనుమానం వెలిబుచ్చారు. రాష్ట్రానికి హోదా సాధనలో భాగంగా ఇప్పటికే హోదా కలిగిన రాష్ట్రాలకు హోదాను కొనసాగిస్తూనే ఏపికి కూడా ఇవ్వాలంటూ పట్టుబట్టాలని కెవిపి సూచించారు. వ్యక్తిగత లబ్దికోసం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టవద్దంటూ కెవిపి లేఖలో విజ్ఞప్తి చేసారు.