భార్య బంగారం కోసం ఎదురింట్లో చోరీ.. దొరికిపోయి జైలుకు..!

By AN Telugu  |  First Published Feb 17, 2021, 9:19 AM IST

ఇరుగు-పొరుగు, మంచీ-చెడు.. ఇవీ నేటి కాలంలో పనికిరాని మాటలైపోయాయి. అవసరం కోసం ఎంతకైనా దిగజారే మనుషులు తయారయ్యారు. పొద్దున లేస్తే మొహమొహాలు చూసుకునే ఎదురింట్లోనే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. తన భార్య నగలు తాకట్టు విడిపించడానికి చేసిన ఈ పని ఇప్పుడతన్ని కటకటాల పాలు జేసింది. 


ఇరుగు-పొరుగు, మంచీ-చెడు.. ఇవీ నేటి కాలంలో పనికిరాని మాటలైపోయాయి. అవసరం కోసం ఎంతకైనా దిగజారే మనుషులు తయారయ్యారు. పొద్దున లేస్తే మొహమొహాలు చూసుకునే ఎదురింట్లోనే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. తన భార్య నగలు తాకట్టు విడిపించడానికి చేసిన ఈ పని ఇప్పుడతన్ని కటకటాల పాలు జేసింది. 

తనఖా పెట్టిన బంగారం విడిపిస్తే తప్ప కాపురానికి రానని చెప్పి భార్య కోసం ఎదురింట్లో చోరీ చేసి ఓ భర్త కటకటాల పాలయ్యాడు. అచ్యుతాపురం మండల కేంద్రం మోసయ్యపేటలో ఈనెల 12న రాత్రి జరిగిన చోరీ కేసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. దీనిక సంబంధించిన వివరాలను ఎలమంచిలి సీఐ నారాయణరావు, ఎస్సై లక్ష్మణరావు మంగళవారం విలేకరులకు వివరించారు. 

Latest Videos

undefined

అనకాపల్లి మండలం మార్టూరుకు చెంది మాటూరి శ్రీను(27) డ్రైవర్ గా పనిచేస్తూ కొంతకాలంగా మోసయ్యపేటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. శ్రీకాకుళానికి చెందిన యువతిని శ్రీను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్ది నెలల క్రితం భార్య ప్రసవం నిమిత్తం పుట్టింటికి వెళ్లింది. ఈ మధ్య కాలంలో శ్రీను భార్యకు చెప్పకుండా ఆమె బంగారాన్ని కుదువ పెట్టి మరో వ్యక్తితో కలిసి ఆటో కొన్నాడు.

ఈ విషయం తెలిసిన భార్య బంగారం విడిపిస్తే కానీ కాపురానికి రానని తెగేసి చెప్పింది. ఇదే టైంలో శ్రీను ఎదురింట్లో ఉండే ధర్మిరెడ్డి కృష్ణవేణి ఈ నెల 12న దిబ్బపాలెం సెజ్ కాలనీలో ఉండే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లింది. రాత్రికి ఇంటికి తిరిగి రాకపోవడం శ్రీను గమనించాడు. 

అంతే, ఆ ఇంటి వెనకతలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. ఇంట్లో ఉన్న ఆరుతులాల బంగారు నగలు, 15 తులాల వెండి వస్తువులు, రూ.50వేల నగదు దొంగిలించాడు. 

తెల్లారి భార్య బంగారం తాకట్టు పెట్టిన ఫైనాన్స్ కంపెనీలోనే దొంగతనం చేసిన సొత్తును కుదువపెట్టి, సొంత నగలు విడిపించుకుని అత్తవారింటికి వెళ్లిపోయాడు. చోరీ విషయం తెలిసిన పోలీసులు దర్యాప్తు చేయగా, శ్రీను కనిపించడం లేదని తెలిసింది. అతడిపై అనుమానం వచ్చి తమస్టైల్లో విచారణ చేయడంతో దొంగతనం విషయం బయటపడింది. 

చోరీ సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మంగళవారం కోర్టుకు తరలించారు. రెండు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న ఎస్సై లక్ష్మణరావు, సిబ్బందిని ఎలమంచిలి సీఐ నారాయణరావు, స్థానికులు అభినందించారు. 

click me!